ప్రతిపక్షం, ఆగస్టు 20: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అభిమాని పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఓ 18 ఏళ్ల యువతికి వీడియో కాల్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వైద్యానికి అవసరమైన మందులు, ఆహారానికి సంబంధించిన ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. రామ్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుప్పలపూడి శశి భవ్యత అనే యువతి కొన్నేళ్లుగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా ఆమె ఎక్కువగా మంచానికే పరిమితమయ్యారు. చిన్నప్పటి నుంచి రామ్ పోతినేని సినిమాలను చూస్తూ ఆయనకు అభిమానిగా మారిన భవ్యత.. రామ్‌ను ఒక్కసారైనా కలవాలని ఎంతోకాలంగా కోరుకుంటున్నారు.
ఆమెకు రామ్ అంటే ఉన్న అభిమానాన్ని కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకున్నారు. భవ్యతకు అన్నం తినిపించే సమయంలో, మందులు వేసే సమయంలో రామ్ ఫొటోలు, ఆయన సినిమాలకు సంబంధించిన వీడియోలను చూపిస్తూ ఆమెకు ధైర్యం కల్పించేవారు. ఇటీవల భవ్యతకు సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అందులో ఆమె రామ్‌ను కలవాలన్న కోరికను వ్యక్తం చేశారు.
ఈ వీడియోలు రామ్ అభిమానుల దృష్టికి వెళ్లడంతో వారు వాటిని హీరో వరకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న రామ్ పోతినేని వెంటనే స్పందించారు. భవ్యతతో నేరుగా వీడియో కాల్ ద్వారా మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ధైర్యం చెప్పారు.
వీడియో కాల్‌లో భవ్యత ‘ఎప్పుడు వస్తారు సార్?’ అని అమాయకంగా రామ్‌ను అడిగినట్లు సమాచారం. దీనికి రామ్ ప్రేమగా స్పందించారు. తాను ఆమెను కలవడానికి వస్తానని, అయితే అప్పటివరకు ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
‘నేను రావాలంటే నువ్వు మంచిగా అన్నం తినాలి.. సమయానికి మందులు వేసుకోవాలి.. బలంగా అవ్వాలి. ఇక నుంచి ఫుడ్, మందులు నేనే పంపిస్తాను. సమయానికి తిని, మందులు వేసుకుంటే నువ్వు బలంగా అవుతావు. ఆ తర్వాత నువ్వు హైదరాబాద్‌కు రావాలి. మనం కలవాలి. నాకు కూడా నిన్ను కలవాలని ఉంది’ అంటూ రామ్ ఆమెకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
రామ్ తన అభిమాని పట్ల చూపించిన ఆప్యాయతకు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. హీరోను కలవాలన్న భవ్యత కోరికకు అభిమానుల ద్వారా స్పందించి, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వ్యక్తిగతంగా ఆరా తీయడమే కాకుండా సహాయం చేస్తానని హామీ ఇవ్వడంపై రామ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సినిమా హీరోగా అభిమానులను అలరించడమే కాకుండా.. కష్టాల్లో ఉన్న అభిమానిని గుర్తించి ఆమెకు అండగా నిలవడం రామ్ పోతినేని మంచి మనసుకు నిదర్శనమని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం భవ్యతతో రామ్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది.
Hero @ramsayz connected with his fan Shashi, who has been bravely battling health issues, over a video call. ❤️
— RAm_UNiversal 🐺 (@RamUniversal1) August 19, 2026
Ram assured Shashi of his complete support and promised to take care of his medical needs. A truly heartwarming gesture from the star. 🙏❤️#RAmPOthineni #RAPO23 pic.twitter.com/KnV8RI0gaM



























