[t4b-ticker]

‘బాసింగ బలాలే’ నటుడి వివాదంలోకి నన్ను లాగొద్దు.. వైష్ణవి సోనీ ఆవేదన

ప్రతిపక్షం, ఆగస్టు 21: ‘బాసింగ బలాలే’ ఫేమ్ ఈశ్వర్ సాయి, మరో నటికి సంబంధించిన వివాదంలో తన పేరును అనవసరంగా ప్రస్తావించడంపై ఫోక్ యాక్ట్రెస్ వైష్ణవి సోనీ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఒక పాట లేదా వీడియోలో కలిసి కనిపించినంత మాత్రాన వ్యక్తిగత సంబంధాలు ఉన్నట్లు కథనాలు సృష్టించడం సరికాదని వైష్ణవి పేర్కొన్నారు. తన పేరును ఈ వివాదంలోకి లాగవద్దని, నిరాధారమైన ప్రచారంతో తన వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని కోరారు.

‘దయచేసి నన్ను ఈ వివాదంలోకి లాగకండి. కేవలం పాట లేదా వీడియో ఆధారంగా కథనాలు సృష్టించవద్దు. నా పని నేను చేసుకుంటున్నాను. ఇతరుల వ్యక్తిగత జీవితాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా వ్యక్తిత్వం, నా స్వభావం గురించి వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదు. నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి’ అంటూ ఆమె సామాజిక మాధ్యమంలో కథనం ద్వారా స్పందించారు.

ఈశ్వర్ సాయి చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో తన పేరును ప్రస్తావిస్తూ జరుగుతున్న ప్రచారం తనను బాధిస్తోందని ఆమె పేర్కొన్నారు. కళాకారుల వృత్తిపరమైన పరిచయాలను వ్యక్తిగత సంబంధాలతో ముడిపెట్టి ప్రచారం చేయడం వల్ల వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై వస్తున్న ప్రచారానికి ఇకనైనా ముగింపు పలికి, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని వైష్ణవి సోనీ కోరారు.

Spread the love

Related News

Latest News