*చండూర్ లో చేగువేరా 59వ వర్ధంతి ఘనంగా నిర్వహణ.
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 09 : చేగువేరా విప్లవ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు అన్నారు. చేగువేరా 59వ వర్ధంతి సందర్భంగా చండూర్ లోని సీపీఐ కార్యాలయం మదగోని నరసింహ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బొడ్డు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేగువేరా ఆశయాలను, విప్లవ పోరాట స్ఫూర్తిని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సామ్రాజ్యవాదం, దోపిడీ, అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, విద్యా, వైద్య రంగాల్లో పెరుగుతున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
చేగువేరా జీవితం కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదని, అణగారిన ప్రజల విముక్తి కోసం సాగిన అంతర్జాతీయ పోరాటానికి ప్రతీక అని అన్నారు. భగత్ సింగ్, చేగువేరా వంటి విప్లవకారుల త్యాగాలు ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని, సమానత్వ భావనను పెంపొందిస్తాయన్నారు. దోపిడీ లేని సమాజం, కుల, మత వివక్ష లేని సమాజ నిర్మాణమే నిజమైన విప్లవ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బరిగెల వెంకటేష్, ప్రజాపక్షం జర్నలిస్టు కర్నాటి వెంకటేశం, సీపీఐ నాయకులు అందిర్కి పరమేష్, చెరుకు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.





























