కేపీహెచ్‌బీ హాస్టల్‌లో యువతి ఉరివేసుకుని మృతి
కుమార్తె మృతిపై తండ్రి ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కూకట్‌పల్లి, ప్రతిపక్షం,అక్టోబర్ 9: కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో యువతి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన తోట ధనలక్ష్మి (22) మృతిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెం మండలం చిట్టిబాబు కాలనీకి చెందిన తోట రమణ కుమార్తె ధనలక్ష్మి రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ 1లోని ఆర్.కె. హాస్టల్‌లో ఉంటూ డొమినోస్ పిజ్జాలో పనిచేస్తోంది. ఆమె తన తండ్రితో తరచూ ఫోన్‌లో మాట్లాడేది.ఈ క్రమంలో అక్టోబర్ 8న సాయంత్రం హాస్టల్ వార్డెన్ శంకర్.. ధనలక్ష్మి గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు ఆమె తండ్రికి సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుమార్తె మృతికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.అదే గదిలో ఉంటున్న యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ధనలక్ష్మి గత నాలుగేళ్లుగా చింటూ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు అతడితో మాట్లాడిన అనంతరం ధనలక్ష్మి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత చింటూ ఈ విషయాన్ని జ్యోతికి ఫోన్ ద్వారా తెలిపినట్లు పేర్కొన్నారు.
ధనలక్ష్మి గది నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వార్డెన్ శంకర్ సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో తలుపులు తట్టారు. అయినా ఆమె తలుపులు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. దీంతో స్థానికుల సహాయంతో గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. చింటూతో ప్రేమ వ్యవహారంలో ఏవైనా విభేదాలు లేదా ఇతర సమస్యలు తలెత్తి ఉండవచ్చని ధనలక్ష్మి తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. అయితే తన కుమార్తె మృతికి అసలు కారణాలు తెలియవని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి బాధ్యులుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.





























