అక్షరాలు, మంచి పనులే సమాజంలో శాశ్వతంగా నిలిచిపోతాయి
మాజీ మంత్రి హరీశ్‌రావు
అభివృద్ధి, హరిత హారం, స్వచ్ఛత, సాహిత్య రంగాల్లో అవార్డుల పంట
యూనివర్సిటీ,న్యాయ కళాశాలల ఏర్పాటుకు కృషి
క్యాన్సర్, గుండె జబ్బులకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 10: అక్షరాలు, మనం చేసే మంచి పనులు సమాజంలో శాశ్వతంగా నిలిచి పోతాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావు అన్నారు. కవులు ఏ పుస్తకం రాసినా దాన్ని అచ్చు వేయించి ప్రచురించే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. సిద్ధిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం విపంచి కళా నిలయంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధిపేట సాహిత్య వైభవాన్ని, తెలంగాణ రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని, భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు.
సాహిత్యానికి ప్రత్యేక చిరునామా సిద్ధిపేట
జీవితం శాశ్వతం కాదని, మనిషి చేసిన మంచి పనులు, రాసిన అక్షరాలు గుర్తుండి పోతాయని పేర్కొన్నారు. రచయితలు, కవులు, సమాజానికి దిశానిర్దేశం చేసే రచనలు చేయాలని సూచించారు. వారు రాసిన పుస్తకాలను ప్రచురించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి, విద్య, వైద్యం, పచ్చదనం, స్వచ్ఛతతో పాటు సాహిత్య రంగంలోనూ సిద్దిపేట ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. నంది పురస్కారాల నుంచి జాతీయ స్థాయి సాహిత్య అకాడమీ పురస్కారాల వరకు ఈ ప్రాంతానికి అవార్డులు రావడం గర్వకారణమని చెప్పారు.
నినాదాల నుంచి అభివృద్ధి వైపు
ఒకప్పుడు ఎన్నికల సమయంలో గోడలపై కనిపించిన నినాదాలు నేడు వాస్తవ రూపం దాల్చాయని హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా ఏర్పాటు, రైలు మార్గం, గోదావరి జలాల సాధన ప్రజల చిరకాల ఆకాంక్షలని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కలలు సాకారం అయ్యాయని పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాగునీరు, తాగునీరు, పచ్చదనం వంటి రంగాల్లో సిద్ధిపేట సమగ్ర అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన మార్పులు ఈ ప్రాంత ప్రగతికి నిదర్శనమని వివరించారు.
పది రెట్లు పెరిగిన వరి ధాన్యం దిగుబడి
గోదావరి జలాల రాకతో సిద్ధిపేట వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పు వచ్చిందని హరీశ్ రావు తెలిపారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఈ ప్రాంతంలో సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యేదని చెప్పారు. నేడు సాగునీటి వసతులు పెరగడంతో దిగుబడి ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి పరిచయం లేని ఆయిల్‌పామ్ సాగు ప్రస్తుతం విస్తరిస్తోందని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేసి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు పొందుతున్నారని చెప్పారు.
సిద్ధిపేటకు చేరిన రైలు మార్గం
గతంలో రైలును చూడాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని హరీశ్ రావు గుర్తుచేశారు. నేడు సిద్ధిపేటకు రైలు మార్గం అందుబాటులోకి రావడం అభివృద్ధిలో కీలక ముందడుని పేర్కొన్నారు. రైల్వే విద్యుదీకరణ పూర్తయితే రైలు సేవలు మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు.
విద్యా రంగంలో మరో రెండు లక్ష్యాలు
సిద్ధిపేటలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్నామని హరీశ్ రావు తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, వైద్య కళాశాల, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ కళాశాల, పాలిటెక్నిక్ లు, ప్రభుత్వ ఐటీఐలు, బీ-ఫార్మసీ, నర్సింగ్, పారా మెడికల్ విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. యూనివర్సిటీ, న్యాయ కళాశాలలను పదేళ్లలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యం
సిద్ధిపేట ఇప్పటికే వైద్య సదుపాయాలను విస్తరించినట్లు హరీశ్ రావు అన్నారు. బస్తీ, పల్లె దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. క్యాన్సర్, గుండె జబ్బుల చికిత్సల కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం తగ్గేలా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేక సదుపాయాలు, గుండె శస్త్ర చికిత్సల కోసం ప్రత్యేక వైద్య సంస్థ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.
స్వచ్ఛ సిద్ధిపేటగా రూపాంతరం
ఒకప్పుడు ఇరుకైన వీధులు, పారిశుధ్య సమస్యలతో సిద్ధిపేటలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ నిర్మాణంతో పారిశుధ్య పరిస్థితుల్లో మార్పు వచ్చిందని తెలిపారు. పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.అభివృద్ధి అంటే సిద్ధిపేట, సిద్ధిపేట అంటే అభివృద్ధి అనే స్థాయికి చేరడానికి ప్రజల ఆశీస్సులు, సహకారమే ప్రధాన కారణమని చెప్పారు.
ప్రగతి పండుగ ప్రజలకే అంకితం
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను గెలిపించి అండగా నిలిచిన ఘనత సిద్ధిపేట ప్రజలదేనని హరీశ్ రావు అన్నారు. ప్రజల మద్దతుతోనే తెలంగాణ రాష్ట్ర సాధనకు బలం చేకూరిందన్నారు. స్వరాష్ట్రంలో జిల్లా ఏర్పాటుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యం అయ్యాయని పేర్కొన్నారు. సిద్ధిపేట అభివృద్ధి వెనుక ఈ ప్రాంత ప్రజల కృషి, సహకారం ఉన్నాయని తెలిపారు. జిల్లా పదేళ్ల ప్రగతి పండుగను ప్రజలకే అంకితం చేస్తున్నామని ప్రకటించారు. కవి సమ్మేళనం సందర్భంగా సాహితీవేత్తలు, కవులు తమ రచనలను వినిపించారు. సిద్ధిపేట సాహిత్య ప్రస్థానం, సామాజిక అభివృద్ధిలో అక్షరాల పాత్రపై చర్చించారు.ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, అయాచితం శ్రీధర్ రావు, టి యు డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, కొమురవెల్లి అంజయ్య, కలకుంట్ల రంగాచారి, అయితా చంద్రయ్య, అమ్మన చంద్రారెడ్డి, కళాంజలి రాజేశ్, పోచబోయిన శ్రీహరి, సువర్ణా దేవి, ఉండ్రాళ్ళ రాజేశం, భీమసేన, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
































