ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క
సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రతిపక్షం, అక్టోబర్ 11: దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడి, పాడారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటలతో వేడుకల్లో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సైతం ఘనంగా చాటుతున్న ప్రవాస తెలంగాణ మహిళలతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయత, ఉత్సాహం మధ్య సాగిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దేశ సరిహద్దులు దాటి విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించడం పట్ల మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నా తమ మూలాలను, సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా బతుకమ్మ వంటి పండుగలను జరుపుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు ప్రవాస తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు, భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడానికి దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క వెంట వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి పాల్గొన్నారు. సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ మహిళలు, ఇతర సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.





























