చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి విజయ్‌..

ప్రతిపక్షం, అక్టోబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. చెన్నైలోని పొరూర్‌ నుంచి పూనమల్లీ వరకు ఇద్దరూ మెట్రోలో ప్రయాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రయాణం సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా టికెట్‌ కొనుగోలు చేసి రైలెక్కడం విశేషంగా నిలిచింది. ఇద్దరు నేతలు కలిసి మెట్రోలో ప్రయాణించిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

అంతకుముందు చెన్నైలో సుమారు రూ.4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన మెట్రో రెండో దశకు సంబంధించిన ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. మెట్రో విస్తరణతో నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం సులభతరం కావడంతో పాటు రహదారులపై వాహనాల రద్దీ తగ్గేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చెన్నైలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదువందల మందికి పైగా కళాకారులు భరతనాట్యం ప్రదర్శిస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నగరంలో సందడి నెలకొంది. మెట్రో రెండో దశ ప్రారంభోత్సవం అనంతరం మోదీ, ముఖ్యమంత్రి విజయ్‌ కలిసి రైలులో ప్రయాణించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మెట్రోలో ప్రయాణించే సమయంలో ప్రధాని స్వయంగా టికెట్‌ కొనుగోలు చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణ ప్రయాణికులు ఉపయోగించే ప్రజా రవాణా వ్యవస్థలో దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ప్రయాణించడం ఆసక్తిని కలిగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Spread the love

Related News

Latest News