లాభదాయక పంటల సాగుతో రైతులకు మేలు

  • నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలి
  • ఖాదర్‌గూడెంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం.. అన్నారంలో క్రికెట్‌ టోర్నమెంట్‌కు శ్రీకారం

ప్రతిపక్షం, మానకొండూర్, అక్టోబర్ 11: మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ, తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు యువతను క్రీడల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆదివారం మానకొండూర్‌ మండలం ఖాదర్‌గూడెం గ్రామంలో కనవేని కొమురయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్తులో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రైతులు ముందుగానే అప్రమత్తమై అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

వరి సాగుపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, ముఖ్యంగా తక్కువ నీటితో సాగు చేయగలిగే కూరగాయల పంటలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుని మెరుగైన ఆదాయం పొందవచ్చని వివరించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవడం ప్రతి రైతు బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు.

హామీని నిలబెట్టుకున్న సర్పంచ్‌ దంపతులు

పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సొంత నిధులతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సర్పంచ్‌ కనవేని అక్షయ, శ్రీనివాస్‌ దంపతులను ఎమ్మెల్యే అభినందించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే సంకల్పంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయడం ఆదర్శనీయమని పేర్కొన్నారు.ఖాదర్‌గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు అంకుస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కనవేని అక్షయ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాద శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రసాద్‌ శ్రీనివాసరెడ్డి, సీఐ శ్రీలత, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మరవెల్లి యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ రామిడి తిరుమల్‌రెడ్డి, నాయకులు రేమిడి శ్రీనివాసరెడ్డి, మీస సత్యనారాయణ, గొల్లెన కొమురయ్య, పేడ తిరుపతిరెడ్డి, తోట శ్రీనివాస్‌, బుర్ర చంద్రశేఖర్‌, కుంభం చిరంజీవి, కనకం అశోక్‌, కోండ్ర సురేష్‌, రేవెల్లి రాజలింగం, ముక్కెర సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నారంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

మానకొండూర్‌ మండలం అన్నారం గ్రామంలో అంబేడ్కర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఇలాంటి టోర్నమెంట్ల నిర్వహణ అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు కిషన్‌, మందల మహేందర్‌, అంబేడ్కర్‌ యూత్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News