దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి

ఖాళీ ఇళ్లలో చోరీలు జరగకుండా ప్రత్యేక పోలీస్ గస్తీ

ఇళ్ల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, అక్టోబర్ 11: దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే సమయంలో ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పండుగ సెలవులను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా పోలీస్ గస్తీని ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తలుపులు, కిటికీలకు పటిష్టమైన తాళాలు వేయాలని, వెనుక తలుపులు, బాల్కనీలను కూడా తనిఖీ చేసుకోవాలని సూచించారు. బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని కోరారు.ఎక్కువ రోజుల పాటు ఇంట్లో ఎవరూ ఉండని సందర్భంలో నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇవ్వడంతో పాటు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా తెలియజేయాలని సూచించారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, భద్రతా అలారం వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలన్నారు.

ప్రయాణ వివరాలు, ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా వెల్లడించవద్దని, ఇంటి తాళాలను బయటకు కనిపించే ప్రదేశాల్లో ఉంచకూడదని స్పష్టం చేశారు.ఇంటి నుంచి బయలుదేరే ముందు అవసరం లేని విద్యుత్ పరికరాలను నిలిపివేయాలని, గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను మూసివేయాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు, కార్లను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేసి, హ్యాండిల్ లాక్‌తో పాటు ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.దసరా సెలవుల సమయంలో ఇళ్లలో చోరీలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం కోసం డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు.ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ పోలీసుల సూచనలు పాటించాలని, నేరాల నివారణలో పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కోరారు. దసరా పండుగ సెలవులను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు

Spread the love

Related News

Latest News