మునుగోడు ప్రజల తాగు, సాగునీటి విషయంలో రాజీ ప్రసక్తే లేదు
*కాంగ్రెస్ ప్రభుత్వం 1800 కోట్లతో ఏదుల నుండి తరలింపు .
*ఫ్లోరైడ్ భూతం నుండి మునుగోడుకు విముక్తి కలిగిస్తాం.
*డిండి ఎత్తిపోతలపై రిటైర్డ్ ఇంజనీర్లతో సమీక్షలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
ప్రతి పక్షం మునుగోడు అక్టోబర్ 11 : ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడుతున్న మునుగోడు నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.హైదరాబాద్లోని తన నివాసంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన డిండి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
*1800 కోట్లు మంజూరు – గత ప్రభుత్వ నిర్లక్ష్యం:
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా డిండి ఎత్తిపోతల పథకానికి, దానికి కొనసాగింపుగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలోని లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటిని ఎక్కడి నుండి తరలించాలనే విషయంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిందని ఆయన విమర్శించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన చొరవతో ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి సంబంధించిన పనులకు గాను రూ. 1800 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.
*ఏదుల నుండే నీటి తరలింపు:
ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భూ సేకరణ, హెడ్ వర్క్స్ పనులతో పాటు సంబంధిత అన్ని పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.ఏదుల రిజర్వాయర్ నుండి నీటి తరలింపుపై కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు ప్రజల ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడబోమని తేల్చి చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాం ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, సలహాదారులు వి. వెంకటరామారావు, ఎం. సత్తిరెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.































