ప్రతిపక్షం, నవంబర్ 25: హైదరాబాద్‌లో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి చేపట్టిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీ స్పందన లభించింది. విశ్వవిద్యాలయంలోని ఎన్సీసీ గేట్ వద్దకు పాదయాత్ర చేరుకున్న సమయంలో వేలాది మంది విద్యార్థులు, యువత, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. విద్యార్థులు, అధ్యాపకుల పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు మార్మోగాయి.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ముప్పు నుంచి యువతను కాపాడుకోవడం దేశ భవిష్యత్తును రక్షించుకోవడమేనని పేర్కొన్నారు. యువత శక్తి, సామర్థ్యాలు దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని, వారు మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత తమ లక్ష్యాలను సాధించి, దేశ పురోగతిలో భాగస్వాములు కావాలంటే వారికి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్పష్టమైన పిలుపు, 2029 నాటికి మాదకద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పం ఈ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. డ్రగ్స్ సమస్యను కేవలం ప్రభుత్వాలు, పోలీసు శాఖ మాత్రమే ఎదుర్కోలేవని, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతాయని పేర్కొన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని చారిత్రక ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అల్లేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి, మల్కా కొమరయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీ నటులు పాయల్ రాజ్‌పుత్, నిఖిల్ సిద్ధార్థ కూడా పాదయాత్రకు మద్దతు తెలిపారు. వారితో పాటు విద్యార్థులు, అధ్యాపకులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
విద్యాసంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. యువతలో మత్తు పదార్థాల పట్ల ఆసక్తి పెరగకుండా ముందుగానే అవగాహన కల్పించడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు సరఫరాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వారిని నేరస్థులుగా చూడకుండా, అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్, పునరావాసం అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లభించిన ఈ భారీ మద్దతు ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమానికి మరింత బలాన్నిచ్చిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ఒక్కరోజుతో పూర్తయ్యే కార్యక్రమం కాదని, నిరంతర ప్రజా ఉద్యమంగా కొనసాగాలని అన్నారు. ప్రతి విద్యార్థి, యువకుడు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు తమ స్నేహితులు, పరిచయస్తులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే డ్రగ్స్ రహిత భారతదేశం లక్ష్యాన్ని సాధించగలమని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.



























