- పెట్రోల్ బంకు నుంచి సీడ్, గన్నీ బ్యాగుల వరకు అక్రమాల ఆరోపణలు.. పర్యవేక్షణ వ్యవస్థ ఏమైంది?
- రూ .52 లక్షల బంకు లెక్కల్లో తేడా.. కంప్యూటర్ విభాగంలో రూ.4 లక్షలు.. సీడ్, గన్నీ బ్యాగుల వ్యవహారంలో రూ.40 లక్షల ఆరోపణలు
- అంతర్గత పర్యవేక్షణ లోపమా? అధికారుల నిర్లక్ష్యమా? సమగ్ర విచారణకు రైతుల డిమాండ్
ప్రతిపక్షం, మానకొండూర్, నవంబర్ 26: రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘంలోనే నిధుల గోల్మాల్ ఆరోపణలు వెల్లువెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైతులు చెమటోడ్చి పండించిన పంటలకు సంబంధించిన లావాదేవీలు, ఎరువులు, విత్తనాల వ్యాపారం, పెట్రోల్ బంకు నిర్వహణ వంటి కీలక కార్యకలాపాలు కొనసాగుతున్న కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి సహకార సంఘంలో ఏకంగా రూ.96 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వస్తున్నా వాటిని గుర్తించి అడ్డుకోవాల్సిన బాధ్యత కలిగిన అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్, డీజిల్ బంకులో సుమారు రూ.52 లక్షల మేర నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాక్ నిల్వలకు, విక్రయాలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా ఈ వ్యవహారం ఇంతకాలం ఎలా కొనసాగిందన్నది అంతుచిక్కడం లేదు.
రోజువారీ అమ్మకాలు, నగదు వసూళ్లు, ఇంధన నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న ఆపరేటర్ సుమారు రూ.4 లక్షలు కాజేసినట్లు, సీడ్ వ్యాపారం, గన్నీ బ్యాగుల లావాదేవీల్లో సీఈఓ సుమారు రూ.40 లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమైతే సొసైటీలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటి రెండు లావాదేవీల్లో తేడాలు రావడం వేరు.. పలు విభాగాల్లో లక్షలాది రూపాయల మేర ఆరోపణలు రావడం వేరు. అయినా ఇంతకాలం ఈ వ్యవహారాలను పర్యవేక్షించిన వారెవరు? లెక్కలు పరిశీలించిన వారెవరు? ఆడిట్ నిర్వహించినప్పుడు లోపాలు బయటపడలేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యవేక్షణ వ్యవస్థ నిద్రపోయిందా?
సహకార సంఘం నిర్వహణలో చైర్మన్, సీఈఓతో పాటు సంబంధిత అధికారులకు కీలక బాధ్యతలు ఉంటాయి. నిధుల భద్రత, లావాదేవీల పారదర్శకత, సిబ్బంది పనితీరు, రోజువారీ లెక్కల పరిశీలన వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇక్కడ వరుసగా ఆర్థిక అవకతవకల ఆరోపణలు రావడం చూస్తుంటే పర్యవేక్షణ వ్యవస్థపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒక విభాగంలోనే కాకుండా పెట్రోల్ బంకు, కంప్యూటర్ విభాగం, సీడ్, గన్నీ బ్యాగుల వ్యవహారాల్లోనూ ఆరోపణలు రావడం వెనుక అసలు కారణాలేమిటి? బాధ్యుల నిర్లక్ష్యమా? పర్యవేక్షణ లోపమా? లేక అంతర్గత కుమ్మక్కు ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరించిన వారిని కూడా గుర్తించడం అంతే ముఖ్యం.
సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ!
ఈ ఆరోపణలపై సొసైటీ చైర్మన్ రాంరెడ్డిని వివరణ కోరగా విచారణ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఈఓ తిరుపతి మాత్రం పెట్రోల్ బంకులో ఎలాంటి గోల్మాల్ జరగలేదని, పైపుల లీకేజీ కారణంగా సుమారు రూ.38 లక్షల విలువైన పెట్రోల్ వృథా అయిందని వివరణ ఇచ్చారు. అయితే పైపుల లీకేజీ జరిగితే దానిని గుర్తించాల్సిన బాధ్యత ఎవరిది? అంత పెద్ద మొత్తంలో ఇంధనం వృథా అయ్యే వరకు నిర్వహణ సిబ్బంది ఏం చేశారు? నష్టం జరిగినట్లు తెలిసిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్న ప్రశ్నలకు స్పష్టత రావాల్సి ఉంది.అంతేకాకుండా బంకులో పనిచేస్తున్న ఉద్యోగిని మరో విభాగానికి ఎందుకు బదిలీ చేశారు? ఆడిట్ నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్న రూ.62 లక్షల షార్టేజీకి, సీఈఓ వివరిస్తున్న రూ.38 లక్షల నష్టానికి మధ్య రూ.24 లక్షల వ్యత్యాసం ఎందుకు ఉంది? ఆ వ్యత్యాసానికి సంబంధించిన లెక్కలు ఏమిటి? అన్న అంశాలు కూడా విచారణలో తేలాల్సి ఉంది.
బాధ్యులెవరో తేల్చాల్సిందే!
సొసైటీలో నిధుల గోల్మాల్ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో నిజానిజాలు వెలుగులోకి రాకపోవడం రైతుల్లో అనుమానాలను మరింత పెంచుతోంది. కేవలం విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తూ కాలయాపన చేయకుండా జిల్లా సహకార శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగాలి. గత కొన్నేళ్ల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, నగదు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లు, కొనుగోళ్లు, విక్రయాల వివరాలు, సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారిపైనే కాకుండా, వాటిని గుర్తించడంలో విఫలమైన పర్యవేక్షణ అధికారుల బాధ్యతను కూడా విచారణలో నిర్ధారించాలి. రైతుల నమ్మకంతో నడవాల్సిన సహకార సంఘం ఆర్థిక ఆరోపణలకు కేంద్రంగా మారితే ఇక రైతులకు భరోసా ఎక్కడ? ప్రజాధనానికి, రైతుల సొమ్ముకు జవాబుదారీ ఎవరు? ఇంత జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించిన వారెవరు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.సొసైటీ సొమ్ము ఎవరి సొంతం కాదు.. రైతుల నమ్మకానికి జవాబు చెప్పాల్సిందే!




























