నేడు అచ్చంపేటకు సీఎం రేవంత్ – చేయూత పింఛన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం

ప్రతిపక్షం, నవంబర్ 26: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లాలో సుమారు రూ.450 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగుకు చేరుకోనున్నారు. అక్కడ రూ.38 కోట్ల వ్యయంతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా రూ.18 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులు, రూ.15 కోట్లతో హరిత హోటల్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనుల ద్వారా ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు స్థానిక ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

మద్దిమడుగు కార్యక్రమాలు ముగిసిన అనంతరం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి అచ్చంపేటకు చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలో సుమారు రూ.450 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.274 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో రూ.29 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు శంకుస్థాపనలు చేయనున్నారు.

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.18 కోట్లు కేటాయించగా, మన్ననూరులో రూ.14 కోట్లతో నూతన ఐటీడీఏ భవనం నిర్మించనున్నారు. అచ్చంపేట పట్టణంలో రూ.2 కోట్లతో ఆదివాసీ భవనాల నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రహదారులు, విద్య, గిరిజన సంక్షేమం, పర్యాటక రంగాలకు సంబంధించిన ఈ పనుల ద్వారా జిల్లాలో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అచ్చంపేట సభ నుంచే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు చీరలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గత ఏడాది పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేసిన ప్రభుత్వం, ఈసారి చిలకపచ్చ రంగులో రెండు రకాల చీరలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్ల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. మహిళలకు పండుగ కానుకగా ఈ చీరలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంపిణీకి ఏర్పాట్లు చేసింది.

ఇదే సభా వేదిక నుంచి కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న కొత్త లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలగనుంది. పింఛన్ల పంపిణీతో పాటు ఇందిరమ్మ చీరల కార్యక్రమం కూడా ఒకే వేదిక నుంచి ప్రారంభం కానుండటంతో అచ్చంపేట పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అచ్చంపేట, అమ్రాబాద్ ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేపట్టారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను అలంకరించడంతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి పనులకు మరింత వేగం వస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ వెల్లడించారు.

Related News

Latest News