మస్కాపూర్లో ఘనంగా సంప్రదాయ ఉత్సవం
ప్రతిపక్షం ప్రతినిధి, ఖానాపూర్, నవంబర్ 26: గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామస్తులు గురువారం ప్రత్యేక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జెట్టక్క వెళ్ళిపో.. లక్ష్మీదేవి రావాలి అంటూ గ్రామస్తులంతా ఒక్కటై సంప్రదాయ వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,విడీసీ సభ్యులు, పాలకవర్గ సభ్యులు పాల్గొని ఉత్సవంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా మహిళలు,యువకులు,వృద్ధులు, చిన్నారులు పాత దుస్తులు ధరించి, చేతుల్లో చీపుర్లు,చాటలు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ, ఒకరినొకరు చీపుర్లతో సరదాగా కొట్టుకుంటూ గ్రామమంతా సందడి చేశారు. అనంతరం జెట్టక్కను ఊరేగింపుగా గ్రామ శివారుకు తీసుకెళ్లి, పాత దుస్తులను అక్కడ వదిలిపెట్టి సంప్రదాయబద్ధంగా సాగనంపారు.
తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం
గ్రామంలో చెడు, దరిద్రం, అనారోగ్యం తొలగిపోయి ప్రతి ఇంటా సుఖసంతోషాలు,ఐశ్వర్యం వెల్లివిరియాలనే నమ్మకంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.జెట్టక్కను సాగనంపి లక్ష్మీదేవిని ఆహ్వానించడం తమ గ్రామంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని వివరించారు. గ్రామ సర్పంచ్,విడీసీ సభ్యులు,పాలకవర్గ సభ్యులు,గ్రామస్తుల సమష్టి భాగస్వామ్యంతో ఉత్సవం వైభవంగా సాగింది.గ్రామమంతా ఒక్కటై నిర్వహించిన ఈ వేడుకతో మస్కాపూర్లో పండుగ వాతావరణం నెలకొంది.





























