కేసీఆర్ కృషిని గుర్తుచేస్తూ బీఆర్ఎస్ కాగడాల ర్యాలీ
60 ఏళ్ల ప్రజల ఆకాంక్షకు ప్రత్యేక జిల్లా రూపం
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, అక్టోబర్ 10: మెదక్ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాకారం చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. క్రిస్టల్ గార్డెన్ నుంచి ఆర్టీసీ డిపో వరకు సాగిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు కాగడాలు చేతబూని జిల్లా ఏర్పాటు ప్రాధాన్యాన్ని, కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తుచేశారు.ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో మెదక్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించినప్పటికీ ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు సంగారెడ్డిలో ఉండటంతో ప్రజలు కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులను కలవడానికి అక్కడికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువైందని, ప్రభుత్వ సేవలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మాతా శిశు సంరక్షణ కేంద్రం వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మెడికల్ కళాశాల మంజూరు, ఘనపూర్ ప్రాజెక్టు మరమ్మతుల ద్వారా వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. తాను మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ప్రత్యేక జిల్లా ఏర్పాటు కావడం తన రాజకీయ జీవితంలో మరచిపోలేని ఘట్టమని అన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 33 జిల్లాల ఏర్పాటు, గ్రామపంచాయతీల విస్తరణతో పరిపాలనలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. మెదక్‌లో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు, రైలు సదుపాయం అందుబాటులోకి రావడం ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పరిణామాలని తెలిపారు. త్వరలో నవోదయ విద్యాలయం కూడా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లా అభివృద్ధి వెనుకబడిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. వరద బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలులోకి రాలేదని ఆరోపించారు. సింగూరు ప్రాజెక్టు నీటి వినియోగం, రైతులకు సాగునీటి సరఫరా అంశాలపై ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని, జిల్లాకు మరింత ప్రాధాన్యం కల్పించాలని వారు కోరారు.
జిల్లా ఏర్పాటు దశాబ్ది సందర్భంగా నిర్వహించిన కాగడాల ర్యాలీ ద్వారా ప్రత్యేక జిల్లా సాధన వెనుక ఉన్న ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను మరోసారి గుర్తుచేసుకున్నామని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, గంగా నరేందర్, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు జుబేర్ అహ్మద్, సోహెల్, దీపక్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు విజయలక్ష్మి, భీమరి కిషోర్, మాయ మల్లేశం, పలువురు మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
































