ప్రతిపక్షం, ఆగస్టు 23: ‘టాక్సిక్’ సినిమా ఈవెంట్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనదైన శైలిలో ఆయన మాట్లాడటంతో కార్యక్రమంలో నవ్వులు పూశాయి. సినిమా హీరో యశ్‌పై ప్రశంసలు కురిపించిన మల్లారెడ్డి.. ఆయనతో ఫొటో దిగాలంటూ స్టేజ్‌పైకి పిలిచి సందడి చేశారు.
‘యశ్ అన్న.. నీతో ఒక్క ఫొటో దిగాలి’ అంటూ యశ్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించిన మల్లారెడ్డి.. అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం యశ్‌ను ప్రశంసిస్తూ ఇండియాలో ఆయనలాంటి హీరో మరొకరు లేరంటూ కొనియాడారు. యశ్ నటన, ఆయనకు ఉన్న క్రేజ్‌ను ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు.
అంతకుముందు సినిమా నిర్మాతను అభినందించిన మల్లారెడ్డి.. తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాకు రూ.2,100 కోట్లు వస్తాయి.. నీకు పైసలే పైసలు’ అంటూ నిర్మాతను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. మల్లారెడ్డి మాటలకు ఈవెంట్‌లో సందడి నెలకొంది.
సినిమా విజయంపై తన అంచనాను వ్యక్తం చేస్తూ మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు మల్లారెడ్డి ప్రసంగంపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.





























