ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించలేని దుస్థితి..
ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటు
విద్యార్థులకు యూనిఫాంలేవి?
బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ? స్కావెంజర్లకు నిధులేవి?
ప్రభుత్వ విద్యారంగంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబరు 26: ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం బాధ్యతారాహిత్యం కారణంగా సిద్ధిపేట జిల్లా విద్యారంగం తీవ్రంగా నష్టపోతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించ లేక ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ విద్యావ్యవస్థ దుస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులకు యూనిఫాంలు అందకపోవడం, పాఠశాలల్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు కాకపోవడం, స్కావెంజర్లకు నిధులు విడుదల చేయకపోవడం, అదనపు తరగతి గదుల నిర్మాణం నిలిచిపోవడం వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.గురువారం సిద్ధిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి హరీశ్ రావు హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించి వారి ఆలోచనలు, సృజనాత్మకతను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు సైన్స్ ఫెయిర్
గత 12 ఏళ్లుగా సిద్ధిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించేవారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఒకప్పుడు రాష్ట్రంలోనే సైన్స్ రంగంలో సిద్ధిపేట జిల్లా అగ్రస్థానంలో నిలిచి జాతీయ స్థాయి అవార్డులు సాధించేదన్నారు. అలాంటి జిల్లాలో నేడు ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌కు, డీఈఓకు కనీస బాధ్యత లేకుండా పోయిందని విమర్శించారు.అధికారులు, యంత్రాంగం పట్టించుకోక పోయినా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ముందుకొచ్చి వేదిక కల్పించడం వల్లే కార్యక్రమం నిర్వహించగలిగామని చెప్పారు. ఇందుకు పాఠశాల యాజమాన్యానికి, దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఆహ్వానం పంపే మర్యాదను కూడా అధికారులు పాటించలేదని విమర్శించారు. రోడ్డుపై వెళ్తూ కార్యక్రమాన్ని చూసి తాను హాజరుకావాల్సి వచ్చిందన్నారు. మీడియా ప్రతినిధులకు సైతం సమాచారం ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు.
33 జిల్లాల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ఎక్కడ అమలవుతోంది?
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పాఠశాల విద్యార్థుల కోసం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. కానీ సిద్దిపేట జిల్లా, నియోజక వర్గంలోని ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనైనా ఈ పథకం అమలవుతున్నట్లు కనిపించడం లేదని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పథకం క్షేత్ర స్థాయిలో ఎందుకు అమలు కావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యా సంవత్సరం ముగుస్తున్నా విద్యార్థులకు యూనిఫారాలేవి?
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా, డిసెంబర్ నెల సమీపిస్తున్నా విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫారాలు అందకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో నాలుగు జతల యూనిఫాంలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్క జత మాత్రమే అందించారని ఆరోపించారు. విద్యా సంవత్సరం ముగిసే దశకు చేరుకుంటున్నా మిగతా యూనిఫాంలు ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.
స్కావెంజర్లకు నిధులేవి.. తరగతి గదుల నిర్మాణం ఏదీ?
గత ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు నిధులు అందడం లేదని విమర్శించారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు. పాఠశాలల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యానికి కీలకమైన స్కావెంజర్లకు నిధులు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. గత మూడేళ్లలో ఒక్క అదనపు తరగతి గదిని కూడా నిర్మించ లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపి వేసిందని విమర్శించారు.
విద్యాశాఖకు లేఖ రాయాలని డీఈఓకు సూచన
జిల్లాలో యూనిఫాం బట్టల పంపిణీలో జాప్యం, స్కావెంజర్లకు నిధుల పెండింగ్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు కాకపోవడం వంటి సమస్యలను తన తరఫున ప్రభుత్వానికి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు లేఖ రూపంలో తెలియ జేయాలని డీఈఓను కోరినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లోనే రేపటి శాస్త్రవేత్తలు
విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచనా శక్తి, శాస్త్రీయ దృక్పథం, నైపుణ్యాలను వెలికితీసే గొప్ప వేదికలని హరీశ్ రావు అన్నారు. విద్యార్థులు చిన్న వారైనా వారిలో గొప్ప శాస్త్రవేత్తలు దాగి ఉన్నారని చెప్పారు.వారి మెదళ్లలో పుట్టే చిన్న చిన్న ఆలోచనలే భవిష్యత్తులో ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణలుగా మారుతాయని పేర్కొన్నారు. నేడు మనం ఉపయోగిస్తున్న టెలిఫోన్‌తో పాటు అనేక అద్భుత ఆవిష్కరణలు శాస్త్రవేత్తల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చాయని వివరించారు. పాఠ్యాంశాల అభ్యసనతో పాటు శాస్త్రీయ ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. విజ్ఞాన ప్రదర్శనలను మరింత సమర్థవంతంగా నిర్వహించి అన్ని పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పించాలని సూచించారు. వారికి అవసరమైన వసతులు, భోజన ఏర్పాట్లు కల్పించాలని అధికారులను కోరారు.విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు, ఇతర సౌకర్యాలు సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యత అని హరీశ్ రావు పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి సిద్దిపేట జిల్లా గత విద్యా వైభవాన్ని తిరిగి నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.





























