ఘటనపై రజక సంఘం నిరసన.. నిందితులను గుర్తించాలని డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 13: మెదక్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు భారీగా విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు పట్టణ సీఐ మహేష్ ఆధ్వర్యంలో విగ్రహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రజక సంఘం నాయకులతో మాట్లాడిన సీఐ, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. పోలీసుల దర్యాప్తు త్వరలోనే పూర్తి చేసి బాధ్యులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు.
విగ్రహం ధ్వంసం విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ నాయకులు ఘటనాస్థలికి చేరుకుని రజక సంఘం నాయకులకు మద్దతు తెలిపారు. మరోవైపు, విగ్రహం వద్ద సరైన కోణంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్న కెమెరాల దృశ్యాలు ఘటనను గుర్తించేందుకు ఉపయోగపడకపోవడంపై రజక సంఘం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విగ్రహానికి తగిన భద్రత కల్పించకపోవడంపై పలువురు పోలీసుల తీరును విమర్శించారు.ప్రభుత్వం అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఆమె విగ్రహానికి రక్షణ లేకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రజక సంఘం ఆధ్వర్యంలో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
































