ప్రతిపక్షం, నవంబర్ 27: మహిళలు పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకునేలా తాను ఆర్థికంగా, హార్దికంగా అండగా ఉంటానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. జనాభాలో సగం ఉన్న మహిళలకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలని, పనుల్లోనే కాకుండా పదవుల్లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహిళలు – రాజ్యాంగం’ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు.
రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజే మహిళలకు నిజమైన పండుగ అని కవిత పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా మహిళలను ఒక వస్తువుగానో, ఆస్తిగానో చూసిన సమాజంలో వారిని స్వతంత్ర వ్యక్తులుగా గుర్తించింది రాజ్యాంగమేనని చెప్పారు. మహిళలకు ఓటు హక్కుతో పాటు అనేక హక్కులను కల్పించిందని, ఆ హక్కుల కారణంగానే వేలాది మంది మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా ఎదిగారని వివరించారు. ప్రతి ఇంట్లో మత గ్రంథాలతో పాటు రాజ్యాంగం కూడా తప్పనిసరిగా ఉండాలని, ప్రతి మహిళ రాజ్యాంగాన్ని చదివి తమ హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు.
మహిళలకు కుటుంబాల్లో ఇప్పటికీ పూర్తి స్వేచ్ఛ లభించడం లేదని కవిత అన్నారు. పెళ్లికి ముందు తండ్రి, అన్న ఆధీనంలో, పెళ్లి తర్వాత భర్త, అత్తింటి వారి ఆధీనంలో మహిళలు ఉండాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. మహిళ ఉద్యోగం చేసినప్పటికీ తన సంపాదనను ఎలా ఖర్చు చేయాలనే విషయంలో ఇతరుల నిర్ణయాలపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తి, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటీవల పత్రికల్లో వచ్చిన రెండు ఘటనలు తనను కలచివేశాయని కవిత తెలిపారు. తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలుడు ఓ బాలికను చెప్పుతో కొట్టిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఒక అమ్మాయి నో చెప్పిందనే కారణంతో ఆమెపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. మరో ఘటనలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని వసతి గృహంలోని మరుగుదొడ్డిలో ప్రసవించిందని వచ్చిన వార్తపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని గర్భవతిగా ఉన్న విషయం వసతి గృహ సిబ్బందికి, అధ్యాపకులకు తెలియలేదా అని ప్రశ్నించారు. మహిళలకు కనీస భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయని నిలదీశారు.
మహిళలకు ఇల్లు, ఇంటి స్థలం, బ్యాంకు ఖాతా, ఉద్యోగాలు వంటి అవకాశాలు అవసరమని కవిత అన్నారు. పింఛన్లు, బంగారం, సైకిళ్లు ఇస్తామనే హామీలకంటే మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగేందుకు అవసరమైన వనరులు కల్పించాలని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా మహిళలపై వివక్ష కొనసాగుతోందని, సమాన పనికి సమాన వేతనం కూడా లభించడం లేదని అన్నారు. కూలీ పనుల నుంచి ఐటీ ఉద్యోగాల వరకు మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే మహిళలకు ప్రత్యేకంగా మరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదని కవిత అభిప్రాయపడ్డారు. దళిత, బీసీ, మైనారిటీ మహిళలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలని, అప్పుడే వారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలరని అన్నారు. ముస్లిం మహిళలు కూడా ఉన్నత విద్యను అభ్యసించి చట్టసభల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషిని గుర్తుచేస్తూ, ఆమెకు మద్దతుగా నిలిచిన ఫాతిమా షేక్ కుటుంబం సేవలను ప్రస్తావించారు. మహిళలకు విద్య అందించేందుకు ముందుకొచ్చిన సావిత్రిబాయి పూలేపై అప్పట్లో మురికి నీళ్లు చల్లారని, ఇప్పుడు మహిళలు రాజకీయాల్లోకి వస్తే అసభ్య వ్యాఖ్యలతో దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది మహిళలు పాల్గొన్నప్పటికీ వారి పోరాటాలకు తగిన గుర్తింపు లభించలేదని కవిత అన్నారు. చరిత్రకు సంబంధించిన 21 పుస్తకాలు వెలువడితే వాటిలో 20 పుస్తకాలను పురుషులే రాశారని, మహిళలు రాసిన రచనల ద్వారానే చాకలి ఐలమ్మ వంటి మహిళల పోరాటాలు మరింతగా వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. మన చరిత్రను ఇతరులు రాస్తారని ఎదురుచూడకుండా మహిళలే తమ చరిత్రను తామే రాసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు తమ బలాన్ని గుర్తించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
తాను కేవలం కాలక్షేపం కోసం పార్టీ పెట్టలేదని, తెలంగాణ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేనను స్థాపించానని కవిత తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని, తమ హక్కుల కోసం తామే పోరాడాలని పిలుపునిచ్చారు. చీరలు కట్టుకున్న మహిళలు కూడా చట్టసభల్లో అడుగుపెట్టాలని, గాజులు వేసుకున్న చేతులు పాలనలో భాగస్వాములు కావాలని అన్నారు. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులపై రాజకీయ పార్టీలు స్పందించాలని కోరారు. మహిళలు తమ గౌరవాన్ని, భద్రతను తామే కాపాడుకోవాలని సూచించారు.
మహిళలు ఎవరికీ తక్కువ కాదని, తమలో ఉన్న శక్తిని గుర్తించాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే మహిళలకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జనాభాలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లోనూ సగం వాటా దక్కాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. రుద్రమసేన నాయకురాళ్లు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని, ప్రతి ఇంట్లో రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల బాధ్యులు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు.






























