పత్తి పంట మాటున గంజాయి సాగు.. పోలీసుల దాడిలో గుట్టురట్టు

రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

రైతును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన

జిల్లా ఎస్పీ జానకి షర్మిల

ప్రతిపక్షం మామడ నవంబర్ 27: పత్తి పంట మాటున అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న రైతు అక్రమాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. నిర్మల్ జిల్లా మామడ మండలం తాండ్ర గ్రామపంచాయతీ పరిధిలోని దంజీ నాయక్ తండాలో గురువారం పోలీసులు దాడులు నిర్వహించి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో సుమారు రూ.28.46 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.తండాకు చెందిన కుల్సోతు రవి అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంట సాగు చేస్తూ, దాని మాటున అంతర పంటగా గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు వ్యవసాయ క్షేత్రంపై పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. పత్తి పంటను క్షుణ్ణంగా పరిశీలించగా అందులో 24 పచ్చి గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించారు.

అదేవిధంగా అక్కడే 54 ఎండిన గంజాయి మొక్కలతో పాటు ప్లాస్టిక్ సంచిలో నిల్వ ఉంచిన 5 కిలోల 320 గ్రాముల ఎండు గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు.అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న రైతును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తం విలువ సుమారు రూ.28 లక్షల 46 వేల వరకు ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రతి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి గస్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నా, విక్రయిస్తున్నా ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసలై విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.జిల్లాలో ఎవరైనా అక్రమంగా గంజాయి సాగు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎస్పీతో పాటు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి,మామడ ఎస్సై మహేష్, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News