ప్రతిపక్షం, నవంబర్ 27: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రముఖ బావర్చి హోటల్ వద్ద రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఘర్షణకు దిగడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదంటూ బీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి బిర్యానీ తినిపిస్తూ వ్యంగ్యంగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
మూడేళ్ల క్రితం ఇదే బావర్చి హోటల్లో బిర్యానీ తింటూ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని బీఆర్ఎస్ నాయకులు గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం హోటల్ వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ఈ ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీల నాయకుల మధ్య మొదట వాగ్వాదం జరగగా, ఆ తర్వాత పరిస్థితి ఘర్షణకు దారితీసింది. దీంతో హోటల్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసినట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదంతో కొంతసేపు హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.
ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా, వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో వచ్చి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. హోటల్లోని ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కూడా దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. తమపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు పార్టీల మధ్య వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం ఏమిటని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ హామీలను గుర్తుచేసే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని గుర్తుచేస్తూ ఆయన చిత్రపటంతో డిన్నర్ కార్యక్రమం నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ యువ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ దాడికి ఓ రాజ్యసభ సభ్యుడే నాయకత్వం వహించారని, తన అనుచరులతో దాడులు చేయించారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని, దానికి నాయకత్వం వహించిన వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయినా, వాటి గురించి ప్రశ్నించే వారిపై దాడులు చేయడం మాత్రం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలను రాజకీయ ఘర్షణలతో పక్కదారి పట్టించలేరని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాగ్వాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది.




























