విద్యార్థుల భవిష్యత్తుకు విద్యా వెలుగులు.. పేదింటి బిడ్డల చదువుకు ప్రజా ట్రస్ట్ అండ!

*చుచుంద, భోసి ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ..*

*స్వయంగా పుస్తకాలు అందజేసిన ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్‌రావు పాటిల్.*

ప్రతిపక్షం, నవంబర్ 27, భైంసా: విద్యార్థులే దేశ భవిష్యత్తు..వారి విద్యాభివృద్ధికి చేయూత అందించడమే నిజమైన సమాజ సేవ అనే సంకల్పంతో ప్రజా ట్రస్ట్ మరో అభినందనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.భైంసా మండలంలోని చుచుంద గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ బోస్లే మోహన్‌రావు పాటిల్ స్వయంగా పాల్గొని తన చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. చదువుతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.

అదేవిధంగా తానూర్ మండలంలోని భోసి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలోనూ పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, పరీక్షల సన్నద్ధతకు అవసరమైన విద్యా సామగ్రిని అందించాలనే ఉద్దేశంతో ప్రజా ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. కేవలం సహాయం అందించడమే కాకుండా, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో ప్రజా ట్రస్ట్ ముందుకు సాగుతోంది.ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్‌రావు పాటిల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థుల చేతిలో పుస్తకం.. వారి కళ్లలో భవిష్యత్తుపై ఆశయం..ఆ ఆశయాలకు అండగా ప్రజా ట్రస్ట్ సేవా ప్రయాణం.

Related News

Latest News