ప్రతిపక్షం, నవంబర్ 27: యువత, చిన్నారులు మాదకద్రవ్యాల మహమ్మారికి దూరంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే మద్యం, డ్రగ్స్ వంటి వ్యసనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసలు కావద్దని హితవు పలికారు. ఎంతమంది ప్రలోభపెట్టినా వాటికి దూరంగా ఉండాలని, చెడు అలవాట్లను మొదటిసారే నిర్మొహమాటంగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో తాను కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉన్నానని చిరంజీవి వెల్లడించారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఒక్కరికీ లభించేది ఒక్కటే జీవితం అని, దాన్ని చెడు అలవాట్లకు బానిసగా మారి వృథా చేసుకోవద్దని చిరంజీవి అన్నారు. చిన్న వయసులోనే వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్నేహితుల ఒత్తిడి, సరదా పేరుతో మొదలయ్యే అలవాట్లు క్రమంగా వ్యసనాలుగా మారతాయని, అందువల్ల మొదటి అడుగులోనే వాటిని తిరస్కరించే ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఒక ముఖ్యమైన విషయాన్ని సమాజం గుర్తుంచుకోవాలని చిరంజీవి అభిప్రాయపడ్డారు. మన పోరాటం మాదకద్రవ్యాలపైనే తప్ప, వాటికి బానిసలైన బాధితులపై కాదని స్పష్టం చేశారు. వ్యసనాల బారిన పడిన వారిని కేవలం నేరస్థులుగా చూడటం లేదా శిక్షించడమే పరిష్కారం కాదని, వారికి సరైన వైద్యం, కౌన్సెలింగ్ అందించి ఆ అలవాటు నుంచి బయటపడేలా సహకరించాలని సూచించారు. బాధితులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కిషన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను చిరంజీవి ప్రశంసించారు. ఈ ఉద్యమం ఒకరి బాధ్యతగా కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మారాలని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణానికి సినీ ప్రముఖులు, యువత, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి ప్రారంభించిన స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ ఉద్యమం రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమం కాదని, దేశ యువత భవిష్యత్తుతో ముడిపడిన సామాజిక ఉద్యమమని తెలిపారు. దేశంలో యువతకు అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని, వాటిని సరైన మార్గంలో వినియోగించినప్పుడే భారత్ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలైతే వ్యక్తిగత జీవితాలే కాకుండా దేశ పురోగతిపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. యువతను వ్యసనాల నుంచి కాపాడటం సమాజం ముందున్న అత్యంత ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటని చెప్పారు.
మాదకద్రవ్యాల సమస్యను కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా భావించకుండా ప్రతి ఒక్కరూ తమ సొంత సమస్యగా తీసుకోవాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని తెలిపారు. దేశవ్యాప్తంగా డీ-అడిక్షన్ కేంద్రాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స, పునరావాసం అందించడంలో సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు.
ఇదిలా ఉండగా, నషా ముక్త్ భారత్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కిషన్‌రెడ్డి చేపట్టిన హైదరాబాద్ పాదయాత్ర మూడో రోజు ఉత్సాహంగా కొనసాగింది. అమీర్‌పేటలోని గురుద్వారా వద్ద సినీనటులు సాయికుమార్, శివారెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి కిషన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సత్యం థియేటర్ సమీపం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తామని సినీ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రకటించారు.
పాదయాత్రకు సినీ పరిశ్రమ నుంచి కూడా మద్దతు లభించింది. సినీనటుడు నాగార్జున యాత్రలో పాల్గొని కిషన్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. డ్రగ్స్ రహిత భారతదేశం నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని కోరారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక సేవ వంటి సానుకూల రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని వర్గాల నుంచి పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
సినీ ప్రముఖులు, బీజేపీ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ పాదయాత్ర జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ వద్ద ముగిసింది. డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం ఒక్కరోజుతో సాధ్యమయ్యేది కాదని, నిరంతర అవగాహన, కుటుంబాల సహకారం, ప్రభుత్వ చర్యలు, ప్రజల భాగస్వామ్యంతోనే లక్ష్యాన్ని చేరుకోగలమనే సందేశాన్ని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.




























