2027లో కరోనా కంటే దారుణ పరిస్థితులు.. ఏఐ నిపుణుడి హెచ్చరిక

ప్రతిపక్షం, నవంబర్ 28: కృత్రిమ మేధస్సు అభివృద్ధి రాబోయే రోజుల్లో మానవాళికి పెను ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణుడు నికోలా హెచ్చరించారు. ముఖ్యంగా 2027లో పరిస్థితులు కొవిడ్‌ మహమ్మారి కంటే దారుణంగా మారవచ్చని ఆయన అంచనా వేశారు. సాంకేతిక రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు భవిష్యత్తులో మానవ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

2030 నాటికి కృత్రిమ మేధస్సుపై మానవులకు పూర్తి నియంత్రణ లేకుండా పోయే ప్రమాదం ఉందని నికోలా అభిప్రాయపడ్డారు. ఏఐ వ్యవస్థలు మరింత శక్తిమంతంగా మారుతున్న కొద్దీ వాటిని నియంత్రించడం కష్టతరమవుతుందని హెచ్చరించారు. ఈ పరిణామాలు మానవుల భద్రత, జీవన విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు, రాబోయే పదేళ్లలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అనేక రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగం పెరగడం వల్ల ప్రస్తుతం మనుషులు నిర్వహిస్తున్న ఉద్యోగాలు, పనుల స్వరూపం మారిపోవచ్చని హెచ్చరించారు. దీనివల్ల ఉపాధి అవకాశాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.

భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నికోలా సూచించారు. కనీసం రెండు వారాలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడంతోపాటు అత్యవసర అవసరాల కోసం కొంత నగదును అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.

కృత్రిమ మేధస్సు వల్ల కలిగే ప్రమాదాలను నివారించాలంటే దాని అభివృద్ధి, వినియోగంపై కఠినమైన నియంత్రణలు అవసరమని నికోలా అభిప్రాయపడ్డారు. తగిన నిబంధనలు, పర్యవేక్షణ లేకుండా ఏఐ అభివృద్ధి కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు. అయితే ఇవి ఆయన వ్యక్తం చేసిన అంచనాలు, హెచ్చరికలు మాత్రమే.

Related News

Latest News