కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీని ముట్టడిద్దాం

డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఆక్యుపై ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి – సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు పిలుపునిచ్చారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఆక్యుపై ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శనివారం మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్‌లో సీఐటీయూ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చుక్కరాములు మాట్లాడుతూ.. అనేక పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా కార్మికవర్గం సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.కార్పొరేట్, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను బలహీనపరుస్తోందని ఆరోపించారు. కార్మిక సంఘాల ఏర్పాటు, వాటి కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ కార్మికుల గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికులకు నెలకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజుకు రూ.174కు తగ్గకుండా వేతనాలు ఉండాలనే విధానం కార్మికుల జీవన ప్రమాణాలకు ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు.

కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ వంటి ప్రధాన కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఎనిమిది గంటల పని విధానానికి భంగం కలిగించే చర్యలతో కార్మికుల శ్రమను దోచుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగిస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.కార్మికుల సమస్యలతో పాటు రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థుల హక్కులపై కూడా దాడులు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చుక్కరాములు అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఢిల్లీకి తరలివచ్చి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే ఆక్యుపై ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కార్యదర్శి ఎం. అడివయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, కోశాధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, కడారి నాగరాజు, నాగేందర్ రెడ్డి, నాయకులు బాబు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News