ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్‌.. పెళ్లి పేరుతో రూ.10.05 లక్షలకు టోకరా!

యువతిని మోసం చేసిన తల్లీకొడుకుల అరెస్ట్‌.. 20 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

సైబరాబాద్‌, నవంబర్ 28 (ప్రతిపక్షం): సోషల్‌ మీడియా వేదికగా పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని రూ.10.05 లక్షల మేర మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడి తల్లిని సైతం అదుపులోకి తీసుకుని, వారి నుంచి సుమారు 20 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని లక్ష్యంగా చేసుకున్న ప్రధాన నిందితుడు జజుల గుణవంత్‌ (A1) ఓ గిటారిస్ట్‌/మోడల్‌కు చెందిన ఫొటోలను దొంగిలించి నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను సృష్టించాడు. తాను సంపన్నుడైన డాక్టర్‌నంటూ యువతికి పరిచయమయ్యాడు. కొంతకాలం నమ్మకం కలిగించిన అనంతరం కుటుంబంలో అత్యవసర పరిస్థితులు ఉన్నాయంటూ వివిధ కారణాలు చెప్పి డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. అంతేకాకుండా రాపిడో కొరియర్‌ ద్వారా బంగారు ఆభరణాలను పంపాలని ఒత్తిడి చేశాడు.

ఇదే క్రమంలో బాధితురాలి ఫిజికల్‌ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డును మోసపూరితంగా తీసుకుని, ఓటీపీలను దుర్వినియోగం చేస్తూ రూ.2.16 లక్షల రుణం కూడా పొందాడు. ప్రధాన నిందితుడి తల్లి పటూరి సురేఖ అలియాస్‌ జజుల సురేఖ (52) కూడా వివాహ సంబంధం నిజమని నమ్మించేలా వ్యవహరిస్తూ, మోసం ద్వారా వచ్చిన నగదును డిజిటల్‌ చెల్లింపుల ఖాతాల ద్వారా స్వీకరించినట్లు పోలీసులు గుర్తించారు.

బంగారు ఆభరణాలు స్వాధీనం

ఈ కేసులో ప్రధాన నిందితుడు గుణవంత్‌ను నవంబర్‌ 5న అరెస్ట్‌ చేశారు. విచారణలో భాగంగా సుమారు 20 గ్రాముల బంగారు ఆభరణాలను బంజారాహిల్స్‌లోని గుప్తా ఆర్ట్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ నుంచి నవంబర్‌ 21న స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8.37 గ్రాముల బంగారు గొలుసు, 12 గ్రాముల బ్రాస్‌లెట్‌ ఉన్నాయి. వీటిని నిందితుడు రూ.2.30 లక్షలకు తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. నేరానికి ఉపయోగించిన మోటరోలా సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడి తల్లి పటూరి సురేఖను నవంబర్‌ 25న అరెస్ట్‌ చేసి, కూకట్‌పల్లిలోని తొమ్మిదో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌కు తరలించింది. మరో నిందితుడు, గుణవంత్‌ బంధువు బొరుగుంట లోకేశ్‌ పరారీలో ఉన్నట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితుడు గతంలోనూ ఇలాంటి మోసానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2023లో రూ.20 లక్షల మోసానికి సంబంధించి కేసు నం.73/2023 నమోదైనట్లు పేర్కొన్నారు.

సోషల్‌ మీడియా పరిచయాలతో అప్రమత్తంగా ఉండాలి

మ్యాట్రిమోనీ, సోషల్‌ మీడియా వేదికలపై పరిచయమయ్యే వ్యక్తుల వివరాలు, గుర్తింపును పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే నమ్మాలని సైబరాబాద్‌ పోలీసులు సూచించారు. ఓటీపీలు, పిన్‌ నంబర్లు, బ్యాంకింగ్‌ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. అపరిచితుల సూచనల మేరకు నగదు బదిలీ చేయడం, కొరియర్‌ ద్వారా విలువైన వస్తువులు పంపడం చేయవద్దన్నారు. సైబర్‌ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ కేసు దర్యాప్తులో ఇన్‌స్పెక్టర్‌ ఎ. మన్మోహన్‌, ఎస్‌ఐ పి. శ్రీనివాసులు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ కె. పుష్ప వెల్లడించారు.

Related News

Latest News