వాట్సాప్ యూజర్లకు కేంద్రం హై-రిస్క్ అలర్ట్- వెంటనే ఇలా చేయండి!

ప్రతిపక్షం, నవంబర్ 28: వాట్సాప్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా విభాగం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రముఖ మెసేజింగ్ యాప్‌లో తీవ్రమైన భద్రతా లోపాలు గుర్తించినట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, చాట్ వివరాలు, ఇతర సున్నితమైన డేటాను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా పాత వెర్షన్లను ఉపయోగిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై తమ యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

సెర్ట్-ఇన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భద్రతా సమస్యలు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకే పరిమితం కావు. ఐఓఎస్ పరికరాలు, డెస్క్‌టాప్ వెర్షన్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. గుర్తించిన లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు రిమోట్‌గా వినియోగదారుల పరికరాల భద్రతను దెబ్బతీయవచ్చని, కొన్ని సందర్భాల్లో హానికరమైన కోడ్‌ను అమలు చేసి వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగదారులు తమ ఫోన్లు, కంప్యూటర్లలో ఉన్న యాప్ వెర్షన్‌ను తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

వాట్సాప్‌లో ప్రధానంగా మూడు రకాల భద్రతా లోపాలను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. మొదటి లోపం కారణంగా ఆండ్రాయిడ్ వినియోగదారుల వాట్సాప్ ఫైళ్లకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. CVE-2026-102769గా గుర్తించిన ఈ సమస్యలో భాగంగా నకిలీ లేదా అనధికారిక యాప్‌ల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఆర్డర్ వివరాల సందేశాలను పంపే అవకాశం ఉందని వెల్లడించింది. అలాంటి సందేశాలపై వినియోగదారులు క్లిక్ చేసినప్పుడు SQL ఇంజెక్షన్‌కు సంబంధించిన లోపం కారణంగా వాట్సాప్‌లోని కొన్ని ఫైళ్లు తొలగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా, వినియోగదారులు ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఉంటే యాప్ క్రాష్ అయ్యేలా చేసి, డెలివరీ రసీదుల సమయాలను పరిశీలించడం ద్వారా చాట్ డేటాబేస్‌కు సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉందని వివరించింది. అయితే ఈ లోపాన్ని ఉపయోగించి ఇప్పటివరకు దాడులు జరిగినట్లు ఆధారాలు లేవని వాట్సాప్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది.

రెండో భద్రతా లోపం మెటా ఏఐ కంప్యూటింగ్ వ్యవస్థకు సంబంధించినది. CVE-2026-44908గా గుర్తించిన ఈ సమస్యకు ప్రధాన కారణం భద్రతా సర్టిఫికెట్లను సరిగా ధృవీకరించకపోవడమేనని వెల్లడించింది. మెటా ఏఐ వ్యవస్థతో అనుసంధానం జరిగే సమయంలో సర్టిఫికెట్ల తనిఖీలో లోపం ఉండటం వల్ల, మెటా అంతర్గత వ్యవస్థలోని కొందరు కీలకమైన భద్రతా వ్యవస్థను దాటివెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా హార్డ్‌వేర్ రూట్ ఆఫ్ ట్రస్ట్‌కు సంబంధించిన భద్రతా వ్యవస్థను అధిగమించే ప్రమాదం ఉందని వివరించింది. అయితే ఈ లోపం ద్వారా కూడా ఇప్పటివరకు సైబర్ దాడులు జరిగినట్లు ఆధారాలు లేవని వాట్సాప్ ధృవీకరించినట్లు తెలిపింది.

మూడో సమస్య ఆండ్రాయిడ్ వాట్సాప్‌లోని ఎక్స్‌టర్నల్ యాడ్-రిప్లై ఫీచర్‌కు సంబంధించినది. CVE-2026-23871గా గుర్తించిన ఈ లోపం కారణంగా వినియోగదారుల ఐపీ అడ్రస్ వివరాలు బయటపడే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన క్లిక్ టు వాట్సాప్ ప్రకటనల ద్వారా హ్యాకర్లు తమ సర్వర్ల నుంచి మీడియా ఫైళ్లను బాధితుల ఫోన్లలో లోడ్ అయ్యేలా చేయవచ్చని నివేదిక వెల్లడించింది. ఈ ప్రక్రియలో వినియోగదారుల ఐపీ అడ్రస్ వివరాలు సైబర్ నేరగాళ్లకు తెలిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని స్పామ్ సందేశాల ద్వారా ఈ లోపాన్ని దుర్వినియోగం చేసి ఉండవచ్చని వాట్సాప్ పేర్కొన్నట్లు సమాచారం.

ఈ భద్రతా సమస్యల ప్రభావం వాట్సాప్‌లోని కొన్ని పాత వెర్షన్లపై ఉంటుందని సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ వాట్సాప్‌లో 2.26.35.74, 2.26.17.4 కంటే ముందు వెర్షన్లు, ఆండ్రాయిడ్ వాట్సాప్ బిజినెస్‌లో 2.26.23.70, 2.26.17.4 కంటే ముందు వెర్షన్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఐఫోన్‌లలోని వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ యాప్‌లలో 2.26.23.72 కంటే పాత వెర్షన్లు, మ్యాక్ డెస్క్‌టాప్ వాట్సాప్‌లోనూ ఇదే వెర్షన్ కంటే ముందు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆటోమేటిక్ అప్‌డేట్‌ల కోసం ఎదురుచూడకుండా స్వయంగా యాప్‌ను పరిశీలించి తాజా సెక్యూరిటీ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్‌కు అప్‌డేట్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ ద్వారా తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. విండోస్, మ్యాక్ కంప్యూటర్లలో వాట్సాప్ ఉపయోగిస్తున్న వారు మైక్రోసాఫ్ట్ స్టోర్, మ్యాక్ యాప్ స్టోర్ లేదా వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొత్త వెర్షన్‌ను పొందవచ్చు.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల వ్యక్తిగత సంభాషణలు, ఫొటోలు, వీడియోలు, పత్రాలు, బ్యాంకింగ్ సంబంధిత సమాచార మార్పిడికి కూడా వాట్సాప్ కీలక వేదికగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో యాప్‌లో భద్రతా లోపాలు బయటపడటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులు, సందేశాలపై క్లిక్ చేయకుండా ఉండటంతో పాటు అనధికారిక వెర్షన్లను ఉపయోగించకూడదని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా గుర్తించిన భద్రతా లోపాల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడే తమ యాప్ వెర్షన్‌ను చెక్ చేసుకుని, అప్‌డేట్ అందుబాటులో ఉంటే ఆలస్యం చేయకుండా ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.

Related News

Latest News