శబరి మాతాజీ మందిర 11వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహణ
అమ్మవారి పల్లకి సేవలో పాల్గొని పల్లకిని మోసిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 28 : ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామీణ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు.హవేలీ ఘనపూర్ మండలం ఫరీద్పూర్ గ్రామంలోని శ్రీశ్రీ పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతాజీ మందిర 11వ వార్షికోత్సవ వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అమ్మవారి పల్లకి సేవలో పాల్గొని స్వయంగా పల్లకిని మోస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శబరి మాతాజీ ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించడంలో ఇలాంటి ఉత్సవాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని పేర్కొన్నారు. భక్తి, సేవాభావం, ఐక్యతతో నిర్వహించే కార్యక్రమాలు సమాజంలో సానుకూల వాతావరణాన్ని కల్పిస్తాయని అన్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా వార్షికోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
అనంతరం గ్రామస్తులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు డప్పు బాబు, మాజీ సర్పంచ్ చిన్న బ్రహ్మం, పోతురాజు బాలయ్య, పల్ల సుదర్శన్, మాజీ ఎంపీటీసీ ఎం. రాజు, పీఏసీఎస్ చైర్మన్ జె. బ్రహ్మం, వైస్ చైర్మన్ దాసరి సిద్ధిరాములు, గ్రామ నాయకులు పోతురాజు సంజు, పోతురాజు పెంటయ్య, సార శ్రీశైలం, సుభాష్, పండ్ల కిష్టయ్య, కుమ్మరి రాములు, సిద్ధి రాములు, రాములు, శ్రీధర్, ఎగొండ, నర్సాగౌడ్, శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యం రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలా గౌడ్, మాజీ ఉపసర్పంచ్ మోహన్ గౌడ్, నాయకులు సతీష్ రావు, రాజేశ్వరరావు, చంద్రమోహన్ గౌడ్, సత్య గౌడ్, కురుమ పోచయ్య, నరేందర్ రెడ్డి, గంజి నవీన్, జగదీష్, ప్రభు గౌడ్, వడ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.





























