ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్ నవంబర్ 28: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వెనుకబడిన పలు పోలీస్ స్టేషన్ల సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. శనివారం నిజామాబాద్ లో డీజీపీ విలేకరుల తో మాట్లాడుతూ
జిల్లాలోని నిజామాబాద్ వన్ టౌన్, 3 టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్, ఆర్మూర్, నందిపేట్, బాల్కొండ, బోధన్ పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, వారు తమ విధులను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా నుంచి రష్యాకు వెళ్లి అక్కడ చిక్కుకున్న వారి పట్ల డీజీపీ ఆనంద్ స్పందించారు. నిజామాబాద్ నుంచి రష్యాకు ఇప్పటి వరకు నలుగురు వెళ్లి అక్కడ చిక్కుకున్నారని, విషయం తమ నోటీసుకు వచ్చిందన్నారు.
నిజామాబాద్ జిల్లా తో ప్రత్యేక అనుబంధం
నిజామాబాద్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. తాను ఇక్కడ పనిచేసిన సమయంలో తనకు రెండవ కుమారుడు జన్మించాడని, నిజామాబాద్ తో అనుబంధం ఉండాలనే ఉద్దేశంతో నిజామాబాద్ నుంచి ‘ని’ అనే అక్షరం వచ్చేలా నిఖిల్ అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. తన కుటుంబానికి కూడా నిజామాబాద్ అంటే ప్రత్యేక అభిమానం ఉందని ఆయన పేర్కొన్నారు.



























