ఈ రబీ సీజన్లో వరి సాగుకు దూరంగా ఉండాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి.. సూక్ష్మ సేద్యంపై రైతులకు సూచనలు
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 12: ఎల్‌నినో ప్రభావంతో రానున్న నెలల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం రామాయంపేటలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి ఆమె హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 76 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారని తెలిపారు. జిల్లాలో 3.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా, వ్యవసాయ శాఖ అధికారుల అవగాహన కార్యక్రమాలతో రైతులు కేవలం 1.94 లక్షల ఎకరాల్లోనే వరి సాగు చేపట్టారని పేర్కొన్నారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు పలువురు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారని, గతంతో పోలిస్తే అంతర పంటల సాగు 28 వేల ఎకరాలు పెరిగిందని వివరించారు.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో రైతులు సాగు ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని సూచించారు. పంట వేసిన తర్వాత నీటి కొరత ఏర్పడితే పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉందని, రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.వరి పంటకు బదులుగా మినుములు, పెసర్లు, శనగలు, కందులు వంటి పప్పుధాన్యాలతో పాటు వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమలు, నువ్వులు వంటి నూనెగింజల పంటల సాగును పరిశీలించాలని సూచించారు. తమ భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని పేర్కొన్నారు.సాగునీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను రైతులు అవలంబించాలని కలెక్టర్ సూచించారు. సూక్ష్మ సేద్య పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం వరకు, జనరల్, ఓబీసీ వర్గాల రైతులకు 80 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అర్హత, నిబంధనలకు అనుగుణంగా సహాయం పొందేందుకు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. యూరియా విక్రయ కేంద్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించాలని, రైతులకు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ మాట్లాడుతూ.. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీలు, వ్యవసాయ సమస్యల పరిష్కారంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులను కోరారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసిన రైతులు తమ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, సీపీఓ సురేష్, మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు బైరం స్వప్న కుమార్, గజవాడ నాగరాజు గుప్తా, డాకీ శ్యామల స్వామి, కొక్కు ప్రవీణ్, ఆదర్శ రైతు అశోక్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
































