యశోద హాస్పిటల్స్ న్యూరో వైద్య నిపుణుడు డాక్టర్ శివరామ్ రావు
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 13: బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును తగ్గించుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ న్యూరో వైద్య నిపుణుడు డాక్టర్ శివరామ్ రావు సూచించారు. మంగళవారం మెదక్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన బరువు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకమన్నారు. పొగతాగడం, పొగాకు వినియోగం, అధిక మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు ఆహారంలో భాగంగా చేసుకోవాలని, ఉప్పు, అధిక కొవ్వు పదార్థాలు, స్వీట్లు, ఫాస్ట్‌ఫుడ్ వినియోగాన్ని పరిమితం చేయాలని తెలిపారు. బీపీ, షుగర్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు మందులు క్రమం తప్పకుండా వాడాలని, అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.
బి12 లోపంతోనూ నరాల సమస్యలు
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, స్పర్శ తగ్గడం, కండరాల బలహీనత, నడకలో ఇబ్బందులు విటమిన్ బి12 లోపం వల్ల కూడా రావచ్చని తెలిపారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచన లేకుండా సొంతంగా మందులు వాడకూడదని సూచించారు.
స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి
ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం, మాట తడబడటం, మాట్లాడలేకపోవడం, చూపులో ఆకస్మిక మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలని డాక్టర్ శివరామ్ రావు సూచించారు. లక్షణాలు కొద్దిసేపటికి తగ్గిపోయినా నిర్లక్ష్యం చేయకూడదని, స్ట్రోక్ చికిత్సలో ప్రతి నిమిషం కీలకమని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్‌లో బైప్లేన్ న్యూరో క్యాథ్ ల్యాబ్ వంటి ఆధునిక సదుపాయాలతో మెదడు రక్తనాళాల సమస్యలకు నిర్ధారణ, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.




























