*ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్.
ప్రతిపక్షం ప్రతినిధి నిర్మల్, నవంబర్ 28: శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో దిశా కమిటీ (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశం ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు (దిశా కమిటీ చైర్మన్) గోడం నగేష్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. విబిజి రామ్ జీ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూ, జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే పనులను వెంటనే ప్రారంభించి, గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఈ పథకం కింద ఉపాధి పనుల కల్పనలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినందుకు అధికారులను అభినందించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లాలో అర్హులందరికీ చేయూత పింఛన్లు అందేలా చూడాలని ఎంపీ అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మెరుగైన టెలికాం సేవల కోసం బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, స్థల కేటాయింపుతో పాటు పనుల్లో జాప్యం చేసే ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో, మిషన్ వాత్సల్య పథకాల ద్వారా చిన్నారుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.
రహదారి ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.పీఎంశ్రీ, సర్వ శిక్షా అభియాన్, పీఎం పోషణ్ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీ సూచించారు. కేంద్ర పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులను సందర్శలకు తీసుకెళ్లాలని సూచించారు.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను మెరుగుపరచాలని అన్నారు. అమృత్ 2.0 కింద మున్సిపాలిటీలలో తాగునీటి ట్యాంకులు, పైప్లైన్ పనులను వేగవంతం చేయాలని, భైంసా మున్సిపాలిటీలో స్థల కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో తగినంత సిబ్బందిని నియమించి సేవలు ప్రారంభించాలని, మంజూరైన మరియు నిర్మాణంలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 1 లక్షా 26 వేల 197 జాబ్ కార్డులు ఉన్నాయని, విబిజి రామ్ జీ పథకం కింద ఉపాధి కల్పనలో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అర్హులకు అవసరాన్ని బట్టి జాబ్ కార్డులు ఇస్తున్నామన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 150 కనెక్షన్లకు కోటి 17 లక్షల రూపాయల సబ్సిడీ మంజూరు చేశామని, అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించే పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. మిషన్ వాత్సల్య కింద రూ. 22 లక్షలు, బేటీ బచావో బేటీ పడావో కింద రూ. 15 లక్షలు కేటాయించామన్నారు.
జిల్లాలో ఇప్పటికే 9,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటామని, రైతులకు సహాయంగా రూ. 1.17 కోట్లు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ కొనుగోళ్లు నిరంతరం కొనసాగుతున్నాయని, గిరిజన సంక్షేమ విద్యా సంస్థల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని చెప్పారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, వెంకట మాధవ రావు, డీఆర్డీఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




























