పత్తి చేల మాటున గంజాయి దందా.. బెంబెరలో పోలీసుల మెరుపు దాడులు!

-అక్రమ గంజాయి సాగుపై పోలీసుల నిఘా.. నేరగాళ్లకు ఇక తప్పదు చట్టపరమైన శిక్ష!

మూడు వ్యవసాయ పొలాల్లో 250 నుంచి 300 వరకు గంజాయి మొక్కల గుర్తింపు.. కోసిన గంజాయి కూడా స్వాధీనం

ప్రతిపక్షం, నవంబర్ 28, బైంసా: నిర్మల్ జిల్లాలో అక్రమ గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పత్తి పంట మాటున గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న గంజాయి పంటను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తానూర్ మండలం బెంబెర గ్రామ శివారులో మూడు వ్యవసాయ పొలాల్లో సుమారు 250 నుంచి 300 వరకు గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించడం జిల్లాలో కలకలం రేపింది.జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల పర్యవేక్షణలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఈ అక్రమ సాగు వెలుగులోకి వచ్చింది. పత్తి పంట మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతూ పోలీసుల కళ్లుగప్పే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటికే కోసిన గంజాయిని విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఇంటి వెనుక భాగంలో దాచిన గంజాయిని సైతం పోలీసులు గుర్తించారు. ఇటీవలే మామడ మండలంలో రెండున్నర ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించిన పోలీసులు, తాజాగా బెంబెరలో మరో భారీ అక్రమ సాగును బయటపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.జిల్లాలో గంజాయి అక్రమ సాగు, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, తనిఖీల్లో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గంజాయి సాగు చేసినా, విక్రయాలకు పాల్పడినా ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.ఈ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Related News

Latest News