గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో లోపాలు సరిదిద్దాలి

15 నుంచి 16 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాల కేటాయింపు

బీఆర్ఎస్ అభ్యంతరం

ఫొటోల స్థానంలో డిగ్రీ సర్టిఫికెట్లు

డూప్లికేట్ ఓట్ల నమోదుపై ఆందోళన

ఓటర్ల జాబితా పరిశీలనలో రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయాలి

తప్పిదాలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు బీఆర్ఎస్ నేతల పిలుపు

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో,హైదరాబాద్,నవంబరు 28: గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న లోపాలను తక్షణమే సరిదిద్ది, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. ఓటర్లు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఓటర్ల జాబితాలో ఫొటోల స్థానంలో డిగ్రీ సర్టిఫికెట్లు కనిపించడం, డూప్లికేట్ ఓట్ల నమోదు, అనుమానాస్పద ఓటర్ల వివరాలపై సమగ్ర విచారణ జరపాలని కోరింది. ఓటర్ల నమోదు, జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దేవీప్రసాద్ ఎన్నికల అధికారులను కలిసి గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా పరిశీలనలో తమ దృష్టికి వచ్చిన పలు సమస్యలను వివరించి వినతి పత్రం సమర్పించారు.

15 నుంచి 16 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలా?

ఓటర్లు నివసించే ప్రాంతాలకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు కేటాయించకుండా 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం వల్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని సోమ భరత్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కొంతమంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 15 నుంచి 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఓటింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల నివాస ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని అందుబాటులో ఉండే సమీప పోలింగ్ కేంద్రాలను కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఫొటోల స్థానంలో డిగ్రీ సర్టిఫికెట్లు

గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో ఫొటోల స్థానంలో డిగ్రీ సర్టిఫికెట్లు పొందుపరచడం వంటి విచిత్రమైన తప్పిదాలు చోటు చేసుకున్నాయని భరత్ కుమార్ వెల్లడించారు. ఈ లోపాలు ఎన్నికల నమోదు అధికారులు(ఈఆర్‌ఓలు) చేసినవా? లేక ప్రైవేటు వ్యక్తులు వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టిన సమయంలో చోటు చేసుకున్నాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఓటర్ల జాబితాలో గుర్తించిన అన్ని తప్పిదాలను సరి దిద్దడంతో పాటు, సంబంధిత జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని కోరారు. తద్వారా నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఇతర అనుమానాస్పద నమోదులను పార్టీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ప్రతి నియోజక వర్గంలో తమ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లు ఈ ప్రక్రియలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సానుకూలంగా స్పందించారని, ఓటర్ల జాబితాలకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలకు అందిస్తామని హామీ ఇచ్చినట్లు భరత్ కుమార్ వెల్లడించారు.

రెండు నియోజకవర్గాల్లో డూప్లికేట్ ఓటర్లు

రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ.. రెండు నియోజక వర్గాల్లో డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఒకే వ్యక్తి పేరుతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు నమోదు అయ్యాయనే అనుమానాలపై సమగ్రంగా పరిశీలన జరిపి, వాస్తవాలను నిర్ధారించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ఇలాంటి నమోదులను గుర్తించి ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. గతంలోనూ కొన్ని వెబ్‌సైట్ల పేర్లు, వాటి చిరునామాలు, ఐపీ అడ్రస్‌లతో సహా పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి అందజేసినట్లు తెలిపారు. ఆయా వెబ్‌సైట్ల ద్వారా ఒక రాజకీయ పార్టీ వేలాది మంది ఓటర్లను నమోదు చేయిస్తోందని అప్పట్లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు వాటిపై చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ఎన్నికల సంఘం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ తరహా అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయని దేవీప్రసాద్ ఆరోపించారు.

బూత్ లెవల్ ఏజెంట్ల సమక్షంలోనే ఓటర్ల పరిశీలన

ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని దేవీప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఓటర్ల నమోదు, అర్హతల పరిశీలన ప్రక్రియ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏల)సమక్షంలో పారదర్శకంగా జరగాలని సూచించారు. బీఆర్ఎస్‌తో పాటు ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటే, ఓటరుగా నమోదైన వ్యక్తి నిజమైన వ్యక్తేనా? గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావడానికి అవసరమైన అర్హతలు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. లేదంటే ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను తీసుకొచ్చి స్థానికంగా ఓటర్లుగా నమోదు చేయించడం ద్వారా స్థానిక ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలను గతంలోనూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, తాజాగా మరోసారి అధికారులకు వివరించినట్లు తెలిపారు.

అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు

ఓటర్ల జాబితా రూపకల్పనలో అర్హులైన ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదని చెప్పారు. అదే సమయంలో అనర్హులు, నకిలీ ఓట్లు జాబితాలో చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సోమ భరత్ కుమార్, దేవీప్రసాద్ కోరారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాలు, ఫొటోలు లేదా ఇతర వివరాల్లో తప్పులు గుర్తించిన ప్రజలు వెంటనే సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌ఓలు), జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓలు) దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ లోపాలను అధికారులకు తెలియజేసి సవరణలకు సహకరించాలని సూచించారు.ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి పూర్తి సహకారం అందిస్తుందని దేవీప్రసాద్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలోని లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిదిద్దడం, రాజకీయ పార్టీలు లేవనెత్తే అభ్యంతరాలను పరిశీలించడం ద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హమైన నమోదులను తొలగించి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు.

Related News

Latest News