కేసీఆర్ దీక్ష.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది

ఫ్రీజోన్ వివాదంపై కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చారిత్రాత్మక నిర్ణయం

ఉద్యమంలో పాల్గొనని నేతలకు కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదు

తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది

దీక్షా దివస్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తాం

  • బీఆర్ఎస్ నేత జి.దేవీప్రసాద్

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్, నవంబర్ 28: హైదరాబాద్ ఫ్రీజోన్ సవరణ అంశంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న దీక్ష నిర్ణయమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని బీఆర్ఎస్ నాయకుడు, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి. దేవీప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిందన్నారు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై గులాబీ పార్టీ మినహా ఇతర రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించలేదని గుర్తు చేశారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలోనే తెలంగాణ సమాజం ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిందన్నారు.హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేవీప్రసాద్ మాట్లాడుతూ.. ‘తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసినందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. నేడు కేసీఆర్‌ను విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు, ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎక్కడ ఉన్నామో, ఎవరికి మద్దతుగా నిలిచామో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

ఉద్యమ చరిత్రను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, ప్రజల ఆరాటం, ఉద్యమకారుల త్యాగాలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ చరిత్రను నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందని దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా నాడు తెలంగాణకు ద్రోహం చేసిన నాయకులకు నేడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను విమర్శించే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్‌ను ఇష్టానుసారంగా దూషిస్తున్న నేతలు తమ గతాన్ని గుర్తుచేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేసీఆర్ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ వేడుకలు

ఆదివారం నిర్వహించనున్న దీక్షా దివస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు దేవీప్రసాద్ వెల్లడించారు. కేసీఆర్‌ను అరెస్టు చేసిన అలుగునూరు ప్రాంతంలో కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల త్యాగాలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. దీక్షా దివస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం, రాష్ట్ర సాధన పోరాటాన్ని గుర్తుచేసే సందర్భమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు దీక్షా దివస్ స్ఫూర్తి సభల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం

డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన అభిప్రాయం ఉందని దేవీప్రసాద్ తెలిపారు. గతంలో ఈ బిల్లు ఎందుకు ఆమోదం పొందలేదో అందరికీ తెలుసని పేర్కొన్నారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు. గతంలో వివిధ సందర్భాల్లో అనుసరించిన విధంగానే బీజేపీ డీలిమిటేషన్ బిల్లులో మార్పులు చేసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని తన నిర్ణయాలపై వెనక్కి తగ్గేలా ఒత్తిడి తీసుకొచ్చిన శక్తుల్లో బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు కీలకమని పేర్కొన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పార్టీ రహస్య ఒప్పందం చేసుకుందని దేవీప్రసాద్ ఆరోపించారు.
నదీ జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్పందించడం లేదని విమర్శించారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేయడం లేదన్నారు.

తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎందుకు మౌనం?

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని దేవీప్రసాద్ విమర్శించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కనీసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని అన్నారు. తెలంగాణను అవమానించేలా బీజేపీ ఎంపీలు వ్యాఖ్యలు చేసినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు మౌనం వహించారని ఆరోపించారు.బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు రహస్య అవగాహనతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమిలోని పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇస్తున్నాయో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలు, రాష్ట్ర హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో అన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాన్ని, కేసీఆర్ చేసిన త్యాగాన్ని ప్రజలు మరిచిపోరని దేవీప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ ఎప్పటికీ రాజీపడబోదని స్పష్టం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజ్, వల్యానాయక్, రామచంద్రు నాయక్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్ గౌడ్, ఉపేంద్రచారి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు విద్యాసాగర్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, అచ్చంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News