మట్టి తేమ ఆధారంగా పనిచేసే స్మార్ట్ వాటర్ పంప్ రూపకల్పన
సైన్స్ ఫెయిర్‌లో ప్రతిభ చాటిన కుకునూరుపల్లి పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు
విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయులను అభినందించిన ఎంఈఓ బచ్చలి సత్తయ్య
ప్రతిపక్షం, నంగునూరు/కుకునూరుపల్లి, నవంబర్ 28: సృజనాత్మక ఆలోచనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రూపొందించిన వినూత్న సైన్స్ ప్రాజెక్టుకు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. సిద్ధిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో కొండపాక మండల కేంద్రంలోని కుకునూరుపల్లి పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘ఆటోమేటిక్ సాయిల్ మాయిశ్చర్ బేస్డ్ వాటర్ పంప్’ (మట్టి తేమ ఆధారిత ఆటోమేటిక్ నీటి పంపు) నమూనా విశేష ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. పాఠశాలకు చెందిన విద్యార్థులు సూర్య ప్రకాశి రెడ్డి, ప్రణీత్ కుమార్ గైడ్ ఉపాధ్యాయులు బాలకృష్ణ, మల్లారెడ్డి, చైతన్యల మార్గదర్శకత్వంలో ఈ నమూనాను రూపొందించారు. వ్యవసాయంలో నీటి వృథాను అరికట్టి, అవసరమైన సమయంలో మాత్రమే మొక్కలకు నీటిని అందించే లక్ష్యంతో ఈ వినూత్న నమూనాను తయారు చేశారు.
మట్టి తేమను గుర్తించి.. మొక్కలకు ఆటోమేటిక్‌గా నీరు!
ఈ ప్రాజెక్టులో మట్టి తేమను గుర్తించే సెన్సార్, సెన్సార్ మాడ్యూల్, రిలే మాడ్యూల్, బ్యాటరీ, డీసీ వాటర్ పంప్‌లను ఉపయోగించారు. కుండీలోని లేదా పొలంలోని మట్టి పొడి బారినప్పుడు సాయిల్ మాయిశ్చర్(మట్టి తేమ) సెన్సార్ ఆ పరిస్థితిని గుర్తించి సిగ్నల్‌ను రిలే మాడ్యూల్‌కు పంపిస్తుంది. దీంతో రిలే స్విచ్ ఆన్ అయి నీటి పంపు పనిచేయడం ప్రారంభిస్తుంది. మొక్కలకు నీరు అందడంతో మట్టిలో తేమ పెరుగుతుంది. నిర్ణయించిన తేమ స్థాయికి చేరుకున్నప్పుడు రిలే స్విచ్ ఆఫ్ అయి పంపు పని చేయడం నిలిచి పోతుంది.ఈ విధానంలో మొక్కలకు అవసరమైన సమయంలో మాత్రమే నీరు అందుతుంది. తద్వారా అనవసరమైన నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు మొక్కలకు నిరంతరం నీటి సరఫరా జరిగేలా చూడవచ్చు. ఈ నమూనాలో సెన్సార్, రిలే మాడ్యూళ్లకు అయిదు వోల్టుల విద్యుత్ సరఫరా, వాటర్ పంప్‌కు మూడు నుంచి ఆరు వోల్టుల డీసీ విద్యుత్ సరఫరాను వినియోగించే విధంగా సర్క్యూట్‌ను రూపొందించారు.
వ్యవసాయానికి ఉపయోగకరమైన సాంకేతిక పరిజ్ఞానం
ప్రస్తుతం నీటి వనరులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో వ్యవసాయంలో నీటి పొదుపునకు ఇలాంటి ఆటోమేటిక్ నీటి సరఫరా పద్ధతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా రైతులు పొలాలకు ప్రతిసారీ వెళ్లి నీటి సరఫరాను పర్యవేక్షించాల్సిన అవసరం లేకుండా, మట్టిలోని తేమ ఆధారంగా పంపు పనిచేసేలా ఈ సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేయవచ్చు. తక్కువ ఖర్చుతో రూపొందించగలిగే ఈ నమూనాను ఇంటి పెరటిలోని మొక్కలు, కుండీల్లో పెంచే మొక్కలు, నర్సరీలు, చిన్నపాటి తోటలు, వ్యవసాయ క్షేత్రాల్లో అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశం ఉంది.విద్యార్థులు పాఠ్యాంశాల్లో నేర్చుకున్న సైన్స్ పరిజ్ఞానాన్ని దైనందిన జీవితానికి, వ్యవసాయ అవసరాలకు అన్వయిస్తూ రూపొందించిన ఈ నమూనా అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించడంలో ఇలాంటి ప్రాజెక్టులు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభినందనలు
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రథమ బహుమతి సాధించిన సందర్భంగా మండల విద్యాధికారి (ఎంఈఓ) బచ్చలి సత్తయ్య విద్యార్థులు సూర్య ప్రకాశ్ రెడ్డి, ప్రణీత్ కుమార్‌తో పాటు గైడ్ ఉపాధ్యాయులు బాలకృష్ణ, మల్లారెడ్డి, చైతన్యలను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చిన్న వయసులోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమాజానికి ఉపయోగపడే నమూనాలను రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకు సాగి ఉన్నత స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ విజయం పాఠశాలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది.




























