మరో రెండు బృందాలు 30న పయనం
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 29: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలో నిర్వహించనున్న మూడు రోజుల పోరాటంలో పాల్గొనేందుకు మెదక్ జిల్లా నుంచి తొలి బృందం ఆదివారం బయలుదేరింది. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బి. బాలమణి, జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం నాయకత్వంలో కార్మికులు సికింద్రాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి పయనమయ్యారు. మరో రెండు బృందాలు నవంబర్ 30న బయలుదేరనున్నాయి.ఈ సందర్భంగా బాలమణి, మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని నలుమూలల నుంచి కార్మికులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, సొంత ఖర్చులతోనే ఈ పోరాటంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.ప్రమాదకరమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, నెలసరి కనీస వేతనం రూ.42 వేలు నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధంగా నిర్ణయించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగిస్తూ 200 పనిదినాలు కల్పించాలని, రోజువారీ కూలీ రూ.600గా నిర్ణయించాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు.ఢిల్లీకి ప్రత్యక్షంగా వెళ్లలేని కార్మికులు డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో తమ తమ పని ప్రదేశాలు, గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.ఈ బృందంలో ఆశా యూనియన్ నాయకులు పుష్ప, సుజాత, రేణుక, గీత, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ యూనియన్ నాయకులు శ్రీనివాస్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన ఆశా వర్కర్లు పాల్గొన్నారు.




























