ప్రతిపక్షం, నవంబర్ 29: తెలంగాణలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతోపాటు వారి సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చారు. వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దివ్యాంగుల సంక్షేమం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
డిసెంబర్ 3న నిర్వహించనున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా, అర్థవంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని బంజారా భవన్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ దివ్యాంగుల హక్కుల ఉద్యమ సంఘాలు, సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, సంక్షేమ కార్యక్రమాలు, సాధికారతకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వారితో చర్చించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కేవలం వేడుకలకే పరిమితం కాకూడదని, దివ్యాంగుల హక్కులు, వారి విజయాలు, సమాజంలో వారికి కల్పించాల్సిన సమాన అవకాశాలపై ప్రజల్లో అవగాహన పెంచే వేదికగా నిలవాలని సూచించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమాజం గుర్తించడంతోపాటు వాటి పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వారి ప్రతిభను వెలికితీసేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా సాంస్కృతిక, క్రీడా పోటీలు, ప్రతిభా ప్రదర్శనలు, విజయగాథలకు వేడుకల్లో ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు.
దివ్యాంగుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, వారికి సరైన అవకాశాలు, ప్రోత్సాహం అందిస్తే అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించగలరని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ విద్యతోపాటు సినిమా, కళలు, క్రీడలు, సాంకేతిక రంగాల్లోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేలా వారికి శిక్షణ, అవకాశాలు కల్పించాలని సూచించారు. ప్రతిభకు వైకల్యం అడ్డంకి కాదని, సరైన మార్గదర్శకత్వం ఉంటే దివ్యాంగ విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు.
ఇదే సమావేశంలో దివ్యాంగ విద్యార్థులకు అందించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం గురించి మంత్రి ప్రస్తావించారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులకు చలనచిత్ర రంగంలో ప్రత్యేక శిక్షణ అందించారు. ఏడు రోజులపాటు నిర్వహించిన ఈ శిక్షణలో విద్యార్థులకు సినిమా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్థులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. వారికి ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పించడం ద్వారా భవిష్యత్తులో సృజనాత్మక రంగాల్లో రాణించేలా ప్రోత్సహించవచ్చని తెలిపారు. దివ్యాంగ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్య, ఉపాధి, సామాజిక గౌరవం వంటి అంశాల్లో దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల ద్వారా దివ్యాంగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి మరింతగా తీసుకురావడంతోపాటు వారి ప్రతిభను సమాజానికి పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దివ్యాంగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సాధికారత దిశగా ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దివ్యాంగులు ఎవరికీ తక్కువ కాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలరని అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు.
























