డీలిమిటేషన్‌ బిల్లుపై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వ్యూహం

ప్రతిపక్షం, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ అంశంపై ఇండియా కూటమి తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ కర్ణాటక, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో కలిసి తదుపరి వ్యూహంపై చర్చించనున్నారు.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో ఈ నలుగురు ముఖ్యమంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వల్ల రాష్ట్రాలకు కలిగే ప్రభావం, రాజకీయ పరిణామాలు, సామాజిక ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించాలని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరాలను ముఖ్యమంత్రులు వివరించనున్నారు.

మీడియా సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పార్లమెంటులో ఈ బిల్లుపై అనుసరించాల్సిన వైఖరి, పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యాచరణపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ విప్‌ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ఎంపీలందరూ ఉదయం 10 గంటలకల్లా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.

మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా డీలిమిటేషన్‌ ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో అధికార పార్టీ తనకు అనుకూలంగా రాజకీయ పటాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి విఘాతం కలిగించేలా ఉండకూడదని స్పష్టం చేశారు.

అణగారిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నాలను అంగీకరించబోమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గాల సరిహద్దులను ఏ ప్రాతిపదికన మార్చబోతున్నారు, ఈ ప్రక్రియలో అనుసరించనున్న విధానాలేమిటో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యంతరాలను పార్లమెంటుతో పాటు ప్రజల్లోనూ వివరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Related News

Latest News