Threats under the guise of journalism will not be tolerated: సమాజంలో జరుగుతున్న మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత అని సిద్దిపేట ప్రెస్ క్లబ్, టీయూడబ్ల్యూ జేఐజేయూ పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై జిల్లా జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై జర్నలిస్టు సంఘం అధ్యక్షులు, నాయకులు మాట్లాడారు. జర్నలిజంలో ఇటీవల కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయని, ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఒకవైపు తన పాత్ర నిర్వహిస్తుండగా రోజురోజుకు విస్తరిస్తున్న సోషల్ మీడియా కుడా మీడియా రంగంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయన్నారు.
అయితే సోషల్ మీడియాలోని కొన్ని సంస్థలు, వ్యక్తులు జర్నలిజాన్ని బ్రష్టు పట్టించే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇది సమాజాన్ని చెడు వైపు నడిపిస్తుందని, జర్నలిస్టుల విలువలను దిగజార్చుతున్నాయన్నారు. ఇది సమాజానికి, పత్రిక, మీడియా స్వేచ్ఛకు మంచిది కాదని, పత్రిక, మీడియా స్వేచ్ఛ ముసుగులో కొందరు వ్యక్తులు, సంస్థలు బరితెగించి వ్యవహరిస్తున్నారని చెప్పారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యాపారులను, వివిధ సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేటు వారిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఇది నిజమైన జర్నలిజం కాదని, అలాగే ఇది జర్నలిస్టులకు ఉండాల్సిన లక్షణం ఎంత మాత్రం కాదని తేల్చి చెప్పారు.
ఇటీవల సిద్దిపేటలో కొందరు వ్యక్తులు సంస్థలు జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ వ్యవహారాన్ని మేము జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి వ్యక్తులు, సంస్థలు జర్నలిజానికి పనికిరారని, వారి చరణను మేము ఎంత మాత్రం సమర్థించ లేమన్నారు. జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు, సంస్థల పట్ల ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలియజేశారు. బెదిరింపులకు పాల్పడి, వ్యక్తుల సమాచారాన్ని సిద్దిపేట ప్రెస్ క్లబ్ లేదా జర్నలిస్ట్ సంఘం దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎవరైనా చట్ట పరమైన తీసుకునేలా చూస్తామని చెప్పారు.
అదేవిధంగా జర్నలిస్టు వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తూ సమాజంలో మంచి, చెడును బహిర్గతం చేస్తున్న నిజమైన జర్నలిస్టులపై ఎవరు దాడులు, బెదిరింపులకు గురిచేసిన చూస్తూ ఊరుకోమన్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్ & టి యు డబ్ల్యూ జేఐజేయూ సిద్దిపేట జిల్లా శాఖ అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి, జర్నలిస్టు సంఘం నాయకులు ఆకుల పాండు, రఘునందన్ స్వామి, దూది దుర్గారెడ్డి, బబ్బురి రాజు, నాయిని సంజీవరెడ్డి, మజ్జు, మడూరి శ్రీరామ్, రంగదాంపల్లి శీను, అయిత శ్రీనివాస్, సాజిద్, రాంరెడ్డి, ఇంద్ర శేఖర్ మల్లారెడ్డి, ఇంద్రశేఖర్, భాస్కర్, జీకురు పరమేశ్వర్, రాజబాబు, సాయి గౌడ్, దయానంద్, నగేష్, నాగరాజు పాల్గొన్నారు.