[t4b-ticker]

మూడు ప్రభుత్వాల్లో ముగ్గురు బర్తరఫ్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన మూడు ప్రభుత్వాల్లోనూ ఒక్కో మంత్రి పదవి కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు కారణాలు, ఆరోపణలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు మంత్రులను ఆయా ముఖ్యమంత్రులు మంత్రివర్గం నుంచి తొలగించారు. తాజాగా కొండా సురేఖ బర్తరఫ్‌తో ఈ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పదవి నుంచి తొలగించారు. వైద్యారోగ్య శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ప్రభుత్వంలోనే మంత్రి స్థాయి నేతపై ఇలాంటి చర్య తీసుకోవడం అప్పట్లో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆ తర్వాత 2021లో కేసీఆర్‌ ప్రభుత్వంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై అసైన్డ్‌ భూముల కబ్జాకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ వివాదంగా మారడంతో ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌కు దూరమై రాజకీయంగా మరో దారిని ఎంచుకున్నారు.

ఇక ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో పాటు సురేఖకు వివరణ కోరుతూ నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. అనంతరం పరిణామాలు వేగంగా మారి చివరకు కొండా సురేఖ మంత్రి పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

అయితే మూడు సందర్భాల్లోనూ కారణాలు, రాజకీయ నేపథ్యాలు పూర్తిగా భిన్నమైనవే. రాజయ్య విషయంలో అవినీతి ఆరోపణలు, ఈటల రాజేందర్‌ విషయంలో భూవివాదం, తాజాగా కొండా సురేఖ విషయంలో పార్టీ అంతర్గత వివాదం ప్రధానంగా చర్చకు వచ్చాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న మూడు ప్రభుత్వాల కాలంలోనూ మంత్రి స్థాయి నేతపై బర్తరఫ్‌ వేటు పడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Spread the love

Related News

Latest News