*రాజన్నను సీఎంగా చూడాలని ఉంది – అభిమాని ఫ్లెక్సీతో హల్ చల్.
*”రాజన్నను తెలంగాణ సీఎంగా చూడాలి” అంటూ అభిమాని ఆకాంక్ష – రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.
*మునుగోడులో రాజన్న సీఎం ఫ్లెక్సీతో రాజకీయ వర్గాల్లో కలకలం.
**సంస్థాన్ నారాయణపురంలో బీటీ రోడ్ల శంకుస్థాపనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫ్లెక్సీ
ప్రతి పక్షం సంస్థాన్ నారాయణపురం/మునుగోడు సెప్టెంబర్ 03: యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన అభిమాని ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. “మా రాజన్న సీఎం కావాలి” అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.
మండల పరిధిలో బీటీ రోడ్ల శంకుస్థాపన, నిర్మాణ పనుల కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి హాజరైన సందర్భంగా ఆయన అభిమాని ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో “రాజన్న.. మాకు ఒక కోరిక ఉంది.. నిన్ను తెలంగాణ సీఎంగా చూడాలి”, “మా రాజన్న సీఎం అవ్వాలి” అంటూ పెద్ద అక్షరాలతో సందేశాలను పొందుపరిచారు. ఫ్లెక్సీలో రాజన్న చిత్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర పటం, చార్మినార్, హైదరాబాద్ దృశ్యాలను కూడా ముద్రించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై ఆయన అభిమాని వ్యక్తం చేసిన ఆకాంక్షగా ఈ ఫ్లెక్సీ కనిపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి పదవిపై అభిమానుల ఆకాంక్షను ప్రతిబింబించేలా ఫ్లెక్సీ ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, ప్రతిపక్ష వర్గాల్లోనూ దీనిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.





























