[t4b-ticker]

రాధాకృష్ణన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొడంగల్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. పిల్లల భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పేవారని సీఎం గుర్తుచేశారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తుకు సరైన మార్గనిర్దేశం చేయాలని సీఎం సూచించారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, మంచి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉంటుందని అన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చదివిన తాను ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 డిసెంబర్‌ 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికి దేశంలో తెలంగాణ 28వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం 17వ స్థానానికి చేరుకున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల ఉపాధ్యాయులు ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన ధర్నాపై కూడా సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఉపాధ్యాయులు ధర్నా చేయడం తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు. తాను గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పనిచేశానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా కాకుండా తమ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Spread the love

Related News

Latest News