జీవో 97 రద్దు చేయాలి.. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు
తన్నీరు హరీశ్‌రావు, మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, సెప్టెంబర్ 5: ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. సిద్ధిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం నిర్వహించిన నిరుద్యోగ యువత, విద్యార్థుల నిరసన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడ?
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు అన్నారు. కళాశాలలు ఫీజుల కోసం విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపి వేస్తున్నాయని తెలిపారు. ఉన్నత విద్యకు వెళ్లాల్సిన విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులకు ప్రభుత్వం అడ్డంకిగా మారకూడదన్నారు.“ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారా? ఇయ్యరా? అసెంబ్లీలో గట్టిగా తేలుస్తా” మని హరీశ్ రావు అన్నారు.
పాలిటెక్నిక్పై పోరాటం
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లడం సరికాదన్నారు. పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక విద్యను కాపాడాలని కోరారు.ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని స్పష్టం చేశారు.
జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్
నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. హామీ మేరకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ కాస్తా ‘జాబ్‌లెస్ క్యాలెండర్’గా మారిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట అభివృద్ధిపై ప్రశ్నలు
సిద్దిపేటలో గతంలో మంజూరైన విద్యా సంస్థలు, అభివృద్ధి పనులను కొనసాగించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. వెటర్నరీ కళాశాల, శిల్పారామం, రంగనాయకసాగర్ పర్యాటక అభివృద్ధి పనులను ఆపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిదర్శనం అన్నారు.సిద్దిపేట విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసు కురావడానికి గతంలో అనేక విద్యాసంస్థలను తీసుకొచ్చామని తెలిపారు.
విద్యార్థులపై కేసులు పెట్టవద్దు
నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు బెదిరించవద్దని హరీశ్‌రావు సూచించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థుల పట్ల కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం తగదన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
అసెంబ్లీలో గళం వినిపిస్తాం
ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తానని హరీశ్ రావు చెప్పారు. జీవో 97 రద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల, ఉద్యోగాల భర్తీ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు.
“మీ కోసం గట్టిగా కోట్లాడుతాం. గల్లా పట్టుకుని అడుగుతాం” అని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. వారి ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం నిరంతరం పోరాడుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.


































