ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాలది దుష్ప్రచారం

  • ఓటు చోరీ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • కాంగ్రెస్‌, ఆప్‌ ఆరోపణలపై బీజేపీ నేత రాపాక ప్రవీణ్‌ ధ్వజం

ప్రతిపక్షం, మానకొండూర్, అక్టోబర్ 12: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ నాయకుడు, కేంద్ర ఫిలిం బోర్డు సభ్యుడు, లక్ష్మీపూర్‌ ఉపసర్పంచ్‌ రాపాక ప్రవీణ్‌ ఖండించారు. ఓటు చోరీ పేరుతో ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక రాహుల్‌ గాంధీ ఓటు చోరీ అంశాన్ని తెరపైకి తెచ్చారని ప్రవీణ్‌ ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై విమర్శలు చేసే ముందు ప్రతిపక్షాలు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. దేశంలో సుమారు 95 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 82 కోట్ల మంది ఇప్పటికే ఓటర్లుగా నమోదయ్యారని, మిగిలిన వారు కూడా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.దేశంలో గతంలోనూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్వహించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే ఏడుసార్లు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలోని బోగస్‌ ఓట్లను తొలగించేందుకు జాబితా సవరణ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతిపక్షాలకు చెందిన కొందరు నాయకులు సైతం గతంలో ఈ ప్రక్రియ వల్ల బోగస్‌ ఓట్ల తొలగింపునకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారని గుర్తుచేశారు.

స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సమయంలో పోలింగ్‌ బూత్‌లలో దరఖాస్తు ఫారాలు నింపుతూ, సమావేశాలకు హాజరయ్యారని ప్రవీణ్‌ తెలిపారు. అలాంటప్పుడు ఇప్పుడు విమర్శలు చేయడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు తొలగించారో ఆధారాలతో వెల్లడించాలని కాంగ్రెస్‌ నాయకులను డిమాండ్‌ చేశారు.దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో అనవసరమైన గందరగోళం సృష్టించకుండా, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా సహకరించాలని సూచించారు. రాబోయే రోజుల్లోనూ దేశంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రావుల శంకరాచారి, జిల్లాల రాజమౌళి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మియాపురం లక్ష్మణాచారి, మండల ప్రధాన కార్యదర్శులు భాషబోయిన ప్రదీప్‌ యాదవ్‌, శీలం కుమార్‌, పోచంపల్లి సర్పంచ్‌ అంబటి స్వామి, దేవంపల్లి ఉపసర్పంచ్‌ దాడి కార్తీక్‌, మాజీ మండల ప్రధాన కార్యదర్శులు వంగళ ఆంజనేయులు, కత్తి ప్రభాకర్‌ గౌడ్‌, మండల ఉపాధ్యక్షులు పోచంపల్లి శ్రీనివాస్‌, మర్రి ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు గాడిచర్ల భూమయ్య, మార్కొండ రమేష్‌ పటేల్‌, మాచర్ల కోటేశ్వర్‌, మండల కార్యదర్శులు నందగిరి బలరాం, ఆరేపల్లి సునంద్‌ కుమార్‌, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు అడప రవి, బీజేవైఎం జిల్లా నాయకులు తాడూరి కిరణ్‌ రెడ్డి, మడ్డీ రాకేష్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు కొండ్ర వరప్రసాద్‌, కాల్వ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News