ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి


*పాలమూరు – రంగారెడ్డితో పాటు డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి – జిల్లాల మధ్య చిచ్చు పెట్టొద్దు
*అవసరమైతే 9వ మోటారును పెట్టాలి.డిండికి 0.5 టీఎంసీలు ఇస్తే చాలు.
*నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాల కోసమే డిండి ఎత్తిపోతల.
*మహబూబ్ నగర్ – నల్లగొండ జిల్లాల మధ్య జల వివాదం లేపడం సరికాదు.
*సీఎం రేవంత్ రెడ్డి రెండు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టాలి.

ప్రతి పక్షం నల్గొండ , అక్టోబర్ 14: డిండి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని, ఇది సరికాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ఆయన కోరారు. నల్లగొండలోని తన నివాసంలో బుధవారం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల కోసమే డిండి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారని వివరించారు.“నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆనాడు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎంతోమంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో నేడు జిల్లాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కొందరు వ్యవహరించడం బాధాకరం. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది” అని అన్నారు.మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రెండు జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించాలన్నదే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

*కేబినెట్ నిర్ణయం – 1.5 + 0.5 టీఎంసీలు:
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ఎదుళ్ల రిజర్వాయర్ నుండి రోజుకు 1.5 టీఎంసీల నీటిని పాలమూరు ప్రాంతానికి, 0.5 టీఎంసీల నీటిని డిండి ఎత్తిపోతల పథకానికి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.అయితే ఈ నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తూ కొందరు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అనవసరమైన వివాదాలు సృష్టించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.నార్లాపూర్ నుండి నీటిని తరలించాలంటే అదనపు ఖర్చుతో పాటు ఎక్కువ సమయం అవసరమవుతుందని, అనుమతుల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతిక అంశాలు, ఆర్థిక భారం, సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రతను, ప్రాంతాల మధ్య సోదరభావాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

*ఫ్లోరైడ్ నుండి శాశ్వత విముక్తి కోసమే డిండి:

నల్లగొండ జిల్లా దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతమని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ సమస్య నుంచి ప్రజలను శాశ్వతంగా కాపాడాలంటే సురక్షితమైన తాగునీటితో పాటు సాగునీటి వసతులు కూడా అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్లు రాజకీయ, ప్రాంతీయ వివాదాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. రెండు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా సాంకేతిక సలహాలు, సూచనలు అందించి ప్రాజెక్టుల పనులను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల ప్రజాప్రతినిధులు పరస్పరం చర్చించుకుని, ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి ఏ జిల్లాకు ఎంత నీరు అవసరమో సామరస్య పూర్వకంగా నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల విషయంలో అనవసరమైన జాప్యం జరగకుండా పెండింగ్ పనులను వేగవంతం చేసి రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

*ఎల్ నినో ప్రభావం – రైతులకు సూచన:

ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిందని, దీనివల్ల విద్యుత్ సరఫరాపై ఒత్తిడి పెరుగుతోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నీటిని, విద్యుత్ ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రబీ సీజన్ లో రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని, అందువల్ల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్ర ప్రయోజనాలే అందరికీ ప్రథమ ప్రాధాన్యం కావాలని, జిల్లాల మధ్య వివాదాలకు తావులేకుండా పరస్పర సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News