జర్నలిస్టుల ఆరోగ్య భద్రతపై పోస్టుకార్డు ఉద్యమం.


*హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలి .

*జర్నలిస్టులకు పెన్షన్, గౌరవ వేతనాలు ఇవ్వాలి.

*ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం.

*ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా ఆందోళనలు.

*ఢిల్లీలో టీయూడబ్ల్యూజే (హెచ్-143) పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం : అవ్వారి భాస్కర్

ప్రతి పక్షం – మునుగోడు , అక్టోబర్ 14: జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (హెచ్-143) ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, టీయూడబ్ల్యూజే ఢిల్లీ యూనిట్ ఇన్‌చార్జి అవ్వారి భాస్కర్ డిమాండ్ చేశారు.బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గల గురజాడ హాలులో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఢిల్లీ యూనిట్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులందరూ పోస్టుకార్డుల ద్వారా తమ సమస్యలను, డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

*ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం – జర్నలిస్టులు: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహించడం బాధాకరమని ఆయన అన్నారు. సొంత రాష్ట్రాన్ని విడిచి ఢిల్లీ కేంద్రంగా ఎండ, వాన, కాలుష్యాన్ని లెక్కచేయకుండా రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఢిల్లీలో తెలంగాణ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. కాలుష్యం, వాతావరణ మార్పులు, ఒత్తిడితో కూడిన పని విధానం కారణంగా అనేక మంది జర్నలిస్టులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అయినా వారికి సరైన వైద్య భద్రత లేకపోవడం శోచనీయమన్నారు.
*ప్రధాన డిమాండ్లు :
జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణమే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. గౌరవ వేతనాలు సహా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని స్పష్టం చేశారు.ఏళ్ల తరబడి జర్నలిస్టులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం లభించకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే పోస్టుకార్డు ఉద్యమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.

*రాష్ట్రవ్యాప్త ఉద్యమం: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అవ్వారి భాస్కర్ హెచ్చరించారు.పోస్టుకార్డు ఉద్యమంలో ప్రతి జర్నలిస్టు భాగస్వామి కావాలని, తమ డిమాండ్లను స్వయంగా పోస్టుకార్డు ద్వారా ముఖ్యమంత్రికి రాయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల ఐక్యతే తమ బలమని, సంఘటిత పోరాటంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (హెచ్-143) ఢిల్లీ అధ్యక్షులు నాగిల్ల వెంకట్, ప్రధాన కార్యదర్శి మేక గోపికృష్ణ, కోశాధికారి కొన్నోజు రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, అశోక్ రెడ్డి, సలహాదారులు ముక్కామల సతీష్, కార్యదర్శి నాగరాజు, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News