*ప్రజల ఆరోగ్య భద్రతే మాకు ముఖ్యం.
*పందులు పట్టే వారిపై దాడి చేయడం హేయమైన చర్య .
*మునుగోడు వద్ద వ్యాన్ అద్దాలు పగలగొట్టి దాడి – నిందితులపై కేసు నమోదు.
*చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు.
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 14 : చండూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో రోజురోజుకు పందులు విపరీతంగా సంచరిస్తున్నాయి. డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలకుండా, ముందస్తు చర్యల్లో భాగంగా బుధవారం నాడు స్థానిక మున్సిపల్ పాలకవర్గం, అధికారులు పందులను పట్టించి, వాహనంలో తరలిస్తున్న సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర పందుల పెంపకందారులు అడ్డగించారు.పోలీసులు వారిని వారించి పంపించగా, పందులను తీసుకెళ్లే వ్యాన్ వెంట పడి మునుగోడు దగ్గరలో అట్టి వాహనాన్ని దొరికించుకొని వ్యాన్ అద్దాలను పగలగొట్టి, పందులను పట్టే వారిపై పెంపకందారులు దాడి చేశారు. అంతలోనే మునుగోడు ఎస్ఐ శోభన్ బాబు సిబ్బందితో వచ్చి దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసులు నమోదు చేశారు.
*చైర్మన్ వివరణ: మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ను వివరణ కోరగా పట్టణ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ అన్ని వీధులలో తిరిగే పందులను పట్టించామని, పందుల పెంపకందారులకు మూడుసార్లు నోటీసులు పంపామని, మున్సిపాలిటీ కార్యాలయమునకు పిలిపించి అనేకమార్లు తెలిపామని, అయినా పెంపకందారులలో మార్పు రాలేదని అన్నారు.చండూరు మున్సిపాలిటీలో సుమారు 25 వేల మంది ప్రజలు నివసిస్తున్నారని, వారి ఆరోగ్య భద్రతే మాకు ముఖ్యమని, భవిష్యత్తులో చండూరు మున్సిపాలిటీ వార్డులలో విచ్చలవిడిగా పందులు తిరిగితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
*దాడి హేయమైన చర్య: పందులు పట్టే వారి పైన, వారి వ్యాన్ పైన దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. దాడిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండ్రెడ్డి మధు ఉన్నారని, పందుల పెంపకందారులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు.పందుల వల్ల పట్టణంలో డ్రైనేజీలు, రోడ్లు పాడవుతున్నాయని, చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్లపై నడవడానికి ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఫిర్యాదులు చేశారని చైర్మన్ తెలిపారు. ప్రజల ఫిర్యాదుల మేరకే ఈ చర్య తీసుకున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కటకం రమేష్, కోడి సుష్మా వెంకన్న, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, గజల కృష్ణారెడ్డి, గురిజ మహేష్, గండూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.































