చేతులు లేకున్నా ఆత్మవిశ్వాసమే అండ

నానమ్మే లోకంగా బతుకు పోరాటం

చిన్నతనంలో తల్లి మరణం.. బతుకు బాటలో పడి తండ్రి దూరం!

విద్యుత్ ప్రమాదం పోయిన రెండు చేతులు

ఉపాధి కల్పించి ఆదుకోవాలని వేడుకోలు

ప్రతిపక్షం, అక్టోబర్ 15: విధి అతడికి చిన్నతనంలోనే కష్టాలను పరిచయం చేసింది. అమ్మ ప్రేమ దూరం అయింది. నాన్న తోడు దొరక లేదు. నానమ్మ తోడుగా ఆత్మస్థైర్యంతో జీవిస్తున్న తను విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. చేతులు లేకుండా జీవితాన్ని సాగించాల్సిన పరిస్థితి ఎదురైనా కుంగి పోలేదు. తన కష్టాలను పంటి బిగువున భరిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న నానమ్మకు అండగా నిలవాలనే ఆశతో జీవిత పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.

తల్లి చనిపోయి..తండ్రికి దూరమై..చేతులు కోల్పోయి…

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాలకు చెందిన ముడికె వెంకటేశ్ చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి మరో వివాహం చేసుకుని బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఈ పరిస్థితుల్లో తనకంటూ కుటుంబ అండ లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రెండేళ్ల కిందట అనుకోని ప్రమాదం ఎదురైంది. విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు. చేతులే జీవన ఆధారంగా కష్టపడిన అతడికి అవే దూరం అయ్యాయి. వైద్యం కోసం రూ.20లక్షలు అప్పు చేసి ఖర్చు చేయాల్సి వచ్చింది. వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మి అప్పులు తీర్చారు.

చేతులు లేకున్నా.. ఆత్మ స్థైర్యమే ఆయుధం!

రెండు చేతులు లేకపోవడం వెంకటేశ్ జీవితాన్ని మరింత కష్టతరం చేసింది. రోజువారీ అవసరాలు తీర్చుకోవడం నుంచి జీవనోపాధి పొందడం వరకు ప్రతిదీ సవాలుగా మారింది. అయినప్పటికీ తన పరిస్థితికి కుంగి పోలేదు. ఎలాగైనా జీవనాన్ని సాగించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. శారీరక వైకల్యం వెనక్కి లాగుతున్నా, ఆత్మవిశ్వాసం అతడిని ముందుకు నడిపిస్తోంది.

అన్నీ నానమ్మే..

జీవితంలో అండగా నిలవాల్సిన కుటుంబ సభ్యులు దూరం అవటంతో 90 ఏళ్ల నానమ్మ మల్లవ్వ వెంకటేశ్ కు అండగా నిలిచింది. వృద్ధాప్యంలో ఆమె మనవడిని చూసుకుంటూ నానా అవస్థలు పడుతోంది. నానమ్మనే తాను చూసుకునే పరిస్థితికి చేరాలనేది వెంకటేశ్ లక్ష్యం. తపన ఉన్నా చేతులు లేవు. ప్రభుత్వం మానవతా దృకృథంతో ప్రభుత్వ కార్యాలయంలో ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఆయన చేయతగ్గ ఉద్యగమో, ఉపాధో చూపించాల్సిన అవసరం ఉంది.ఈ పరిస్థితుల్లో వెంకటేష్‌కు తన నానమ్మ మల్లమ్మే ప్రధాన ఆధారంగా నిలిచింది. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన అతడికి నానమ్మే అమ్మగా, నాన్నగా మారి తోడుగా నిలిచింది. ఆమె నీడలోనే జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ మల్లమ్మను చూసుకోవాలనే బాధ్యత వెంకటేశ్ మనసులో బలంగా ఉంది. ఆమెకు ఆసరాగా నిలవాలని ఆరాట పడుతున్నాడు. ఇందుకోసం జీవనాధారం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాడు. ఉపాధి లేకపోవడంతో వారి జీవితం కష్టాల మధ్య సాగుతోంది. కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. తన పరిస్థితిని అర్థం చేసుకుని ఎవరైనా ఉపాధి కల్పిస్తే, నానమ్మను చూసుకుంటూ గౌరవంగా జీవించవచ్చనే ఆశతో ఎదురు చూస్తున్నాడు.

సానుభూతి కాదు.. చేయూత కావాలి!

వెంకటేశ్ కు కావాల్సింది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు. తన కష్టాల నుంచి బయటపడి జీవించేందుకు ఓ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. దేంట్లో భాగంగానే గత సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి తన నానమ్మ మల్లవ్వతో కలిసి వెళ్లిన వెంకటేశ్ తనకు ఉపాధి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశాడు. అతని జీవిత పోరాటం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. అనాథ పరిస్థితుల్లో పెరిగి, శారీరక వైకల్యంతో పోరాడుతూ, వృద్ధ నానమ్మకు అండగా నిలవాలని తపిస్తున్న అతనికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించి వెంకటేశ్ తగిన ఉపాధి కల్పించడంతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు. అతడి సామర్థ్యానికి అనుగుణంగా ఉపాధి లేదా స్వయం ఉపాధి అవకాశం కల్పిస్తే, తన జీవితాన్ని తానే నిర్మించుకునే అవకాశం లభిస్తుంది. అమ్మను కోల్పోయాడు.. నాన్నకు దూరమయ్యాడు. రెండు చేతులు లేక జీవితంతో పోరాడుతున్నాడు.. అయినా నానమ్మను చూసుకోవాలనే ఆశను మాత్రం వదులుకోలేదు. సమాజం అందించే చిన్న చేయూత అతడి జీవితంలో పెద్ద మార్పుకు నాంది కావచ్చు. వెంకటేశ్ కన్నీళ్లను తుడిచి, ఆత్మగౌరవంతో బతికే అవకాశం కల్పిద్దాం.

Spread the love

Related News

Latest News