ప్రభుత్వ ప్రణాళికా లోపాలతో విద్యుత్ సంక్షోభం

బొగ్గు సరఫరా చేయకుండా అధికారులను బాధ్యులను చేస్తారా ?

వైటీపీఎస్‌ సీఈ సురేష్‌ సస్పెన్షన్‌పై దేవీప్రసాద్‌ ఆగ్రహం

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్, అక్టోబరు 15: “విద్యుత్ ఉత్పత్తి తగ్గితే క్షేత్రస్థాయి అధికారులను బలి చేయడం సరికాదు. బొగ్గు సరఫరా, నిర్వహణ, ప్రభుత్వ ప్రణాళికలపై సమగ్ర విచారణ జరపాలి. బాధ్యత నిర్ణయించడంలో వివక్షకు తావుండ కూడదు” అని టీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్ లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ ప్రణాళికా లోపాలే కారణమని దేవీప్రసాద్‌ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను అధికారుల పైకి నెట్టడం సరికాదన్నారు. వైటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సురేష్‌ను సస్పెండ్‌ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది అధికారులను బలిపశువులను చేయడమేనని విమర్శించారు.

బొగ్గు సరఫరా లేకుండా ఉత్పత్తి ఎలా?

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, విద్యుత్‌ ప్లాంట్లకు సకాలంలో సరఫరా కావడం లేదని దేవీప్రసాద్‌ పేర్కొన్నారు. దీంతో విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని తెలిపారు. అవసరమైన బొగ్గును సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, జెన్‌కో యాజమాన్యంపై ఉందన్నారు. ముడిసరుకు అందు బాటులో లేకపోతే అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోలేదనే కారణంతో అధికారులను సస్పెండ్‌ చేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ముందుగా బొగ్గు సరఫరాలో లోపాలను గుర్తించాలని సూచించారు.

ఎత్తిపోతల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం

గోదావరి నదిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ, ఎత్తిపోతల పథకాల నిర్వహణలో వైఫల్యాల వల్ల నీటి కొరత ఏర్పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం, కరెంటు ఉండదని, నీరు దొరకదని, పంటలు వేయవద్దని హెచ్చరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అధికారులపైకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

స్టేజ్‌-1పైనే చర్యలు ఎందుకు?

వైటీపీఎస్‌ స్టేజ్‌-1లో సమస్యలకు బాధ్యుడిగా సురేశ్ పై చర్యలు తీసుకున్నప్పుడు, స్టేజ్‌-2లోని పరిస్థితులపైనా విచారణ జరపాలని దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులపైనే చర్యలు తీసుకుని, ఉన్నతస్థాయి అధికారుల బాధ్యతలను విస్మరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులపై చర్యలు తీసుకోకుండా, తెలంగాణ అధికారులనే లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

సమగ్ర విచారణ జరపాలి

బొగ్గు సరఫరా, సాంకేతిక నిర్వహణ, ఉత్పత్తి ప్రణాళికలు, యాజమాన్య పర్యవేక్షణపై సమగ్ర విచారణ జరపాలని దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. తప్పు చేసిన వారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవస్థాగత లోపాలకు ఉద్యోగులను బాధ్యులుగా చేయడం అన్యాయమని పేర్కొన్నారు. విద్యుత్‌ సంస్థల్లో అధికారుల నియామకాలు, బదిలీలు, బాధ్యతల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. కీలక విభాగాల్లో తెలంగాణ అధికారులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రణాళికా లోపాలను సరిదిద్దాలని దేవీప్రసాద్‌ అన్నారు. విద్యుత్‌ సంస్థల పనితీరుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, ఇంజనీర్లలో నెలకొన్న ఆందోళనను తొలగించాలని కోరారు. బాధ్యతల నిర్ధారణలో వివక్షకు తావులేకుండా న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News